Local Body Elections: పంచాయతీలకు గూడు కరువు.. కాబోయే సర్పంచ్‌లకు పరీక్షే..
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:03 AM
జిల్లాలో పలు చోట్ల కొత్తగా గెలిచే సర్పంచ్లకు పాలన పగ్గాలు చేపట్టేందుకు సొంత భవనాలే కరువయ్యాయి. పలు చోట్ల పాఠశాలలు, ఇతర భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. దీంతో పంచాయతీ సమావేశాలు నిర్వహించేందుకు పాలకవర్గ సభ్యులు అవస్థలు పడుతున్నారు.
బెల్లూరు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. బరిలో నిలిచిన అబ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల పంచాయతీలకు సొంత భవనాలు లేకపోవడం ఆయా అభ్యర్థులకు పరీక్షగా మారింది. అద్దె, ఇతర భవనాల్లో అరకొర వసతుల మధ్య కొత్త పాలకవర్గాలకు స్వాగతం పలక నుండడం వారికి ఆరంభంలోనే అవస్థలకు గురి చేయనున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల సరిపడా స్థలం లేక సమావేశాలు రచ్చబండ వద్ద, చెట్లకింద నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది వరకు ఉన్న పంచాయతీలకు కొంత ఇబ్బంది లేకపోయినా ఆరేళ్ల కిందట ఏర్పడిన పంచాయతీలకు సొంత గూడు కరువైంది. ఉపాధిహామీ నిధుల కింద ఒక్కో భవనానికి రూ.20 లక్షలు మంజూరు చేసినా బిల్లులు సకాలంలో రావనే భావనతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు నిరాసక్తత ప్రదర్శించడం సర్పంచ్‌లు చొరవ తీసుకున్న చోట నిధులు రాక పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.
జిల్లాలో పరిస్థితి ఇలా..
కుమరం భీం అసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, జిల్లాలోని 52 గిరిజన పంచాయతీల భవనాల నిర్మాణాలకు ఒక్కో దానికి రూ.20లోల చొప్పున నిధులు మంజూరయ్యాయి. వీటిలో కొన్నింటికి స్థలాల కొరతతో పనులు ప్రారంభించ లేదు. ప్రారంభమైన చోట తదుపరి బిల్లులు రాక అర్ధంతరంగానే నిలిచిపోయాయి. రెండేళ్లు కావస్తున్నా నిధులు రాక అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో ఆయా పంచాయతీల్లో పాలక వర్గాలకు సమావేశాలు నిర్వహించేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది.
దశాబ్దాల క్రితం ఏర్పాటైన వాటికీ..
దశాబ్దాల కిందట ఏర్పడిన గ్రామాలదీ ఇదే పరిస్థితి. పలుచోట్ల భవనాలు శిథిలా వస్థకు చేరుకున్నాయి. మరికొన్ని పాఠశాలలు, ఇతర భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో పల్లె పాలనకు ఆటంకాలు తలెత్తుతున్నాయి. ఇక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పల్లెల్లో జోరుగా ప్రచారం కొనసాగుతోంది. మరో పది రోజుల్లో కొత్త పాలకవర్గాలు ఏర్పడుతున్న నేపథ్యంలో వారికి సవాళ్లు దర్శనమిస్తున్నాయి. కొత్తగా కొలువుతీరే పాలకవర్గాలైనా భవనాల నిర్మాణాల ఏర్పాటుకు పాటుపడాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ప్రవాస టిబెటన్ల కవిత్వ ప్రతిఘటన