Tibetan Exile Poetry Resistance: ప్రవాస టిబెటన్ల కవిత్వ ప్రతిఘటన
ABN , Publish Date - Dec 08 , 2025 | 06:43 AM
తల్లి గర్భం నుండి బయటకు రావడమే మొదటి వలస. ఇక ఆ తర్వాత జీవితంలో ఏదో ఒక రూపంలో వలస అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. అయితే అన్ని వలసలూ ఒకటి కావు. కొన్ని కోరి తెచ్చుకున్నవి అయితే, మరికొన్ని నెట్టబడ్డ వలసలు...
తల్లి గర్భం నుండి బయటకు రావడమే మొదటి వలస. ఇక ఆ తర్వాత జీవితంలో ఏదో ఒక రూపంలో వలస అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. అయితే అన్ని వలసలూ ఒకటి కావు. కొన్ని కోరి తెచ్చుకున్నవి అయితే, మరికొన్ని నెట్టబడ్డ వలసలు. రెండింటిలోనూ ఇబ్బందులున్నా, కోరి తెచ్చుకున్నాక భరించడం తప్ప మొర పెట్టుకునేందుకు ఆస్కారం లేదు. కానీ నెట్టబడ్డ వలసల్లో మొర పెట్టుకునేందుకు కూడా చాలనన్ని ఇబ్బందులు అడుగడుగునా ఎదురవుతూనే ఉంటాయి. ఇలాంటి సంఘర్షణామయ జీవితాలు మాతృభూమితో ఆ ప్రవాసుల బంధాన్ని మరింత బలపడేట్టు చేస్తాయి. ఎప్పటికైనా తిరిగి వెళ్ళే అవకాశం కోసం ఎదురుచూస్తూనే వారు జీవితాలను ఖర్చు పెట్టేస్తారు.
భారతదేశానికీ చైనాకూ మధ్యనున్న టిబెట్ 1950 దాకా పూర్తి స్వతంత్ర దేశం. 1950 నుండి టిబెట్‌ను చైనా ఆక్రమించింది. చైనా అణచివేతను భరించలేక 1959లో దలైలామా టిబెట్‌ని వదిలి భారత దేశం వచ్చి హిమాలయాల దిగువన ఉన్న ధర్మశాలలో తలదాచుకున్నారు. దలైలామాతో బాటు, వేలమంది టిబెట్ వాసులు దేశం నుండి పారిపోయి ప్రపంచంలో అనేకచోట్ల ప్రవాసంలో బతుకుతున్నారు. అధిక సంఖ్యలో భారతదేశంలోనే శరణార్థులుగా గడుపుతున్నారు. ధర్మశాలలో టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా టిబెట్ ప్రభుత్వాన్ని స్థాపించి దలైలామా నడిపిస్తున్నారు. తనతోబాటు టిబెట్ నుండి బయటకు వచ్చిన వారి బాగోగులను, చదువు సంధ్యలను ఆయనే చూసుకుంటున్నారు. ఇప్పుడు దలైలామా తొమ్మిది పదుల వయసుకు చేరుకున్నారు. తన తరువాత ఎలా అన్నది ఆయనకే కాదు, ఆయన మీద ఆధారపడి ప్రవాసం గడుపుతున్న టిబెట్ వాసులకు, వారికి ఆశ్రయమిచ్చిన భారతదేశానికీ ప్రశ్నార్థకమే! మరోపక్క చైనా ఇదే పరిణామం కోసం ఎదురుచూస్తున్నది. అటు చైనా ఇటు భారతదేశం, ఈ రెండు బలీయమైన దేశాల మధ్య టిబెట్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
టిబెట్ వాసులంటే టిబెట్‌లో ఉన్నవారే గాక, టిబెట్‌లోనే పుట్టి ప్రవాసంలో జీవితాలను గడుపుతున్నవారు, ప్రవాసంలో పుట్టి ప్రవాసంలోనే పెరుగుతున్నవారు కూడా. వారి హృదయాలు తెలియని మాతృభూమి కోసం తహతహలాడుతుండగానే, వారు తెలియని దేశాలలో జీవితాన్ని నిర్మించుకునే సవాలును ఎదుర్కొంటున్నారు. మతం ద్వారా పురాణాల ద్వారా మాత్రమే తెలిసిన భూమికి తిరిగి పోవాలని కోరుకుంటున్నారు. కానీ మాతృభూమిలోని పరిస్థితులు వారిని ఆపుతున్నాయి. అహింసను బోధించే బౌద్ధ సిద్ధాంతాలకు కట్టుబడి, ఆధ్యాత్మిక తండ్రిగా భావించే దలైలామా కోరికకు బద్ధులై, వారు క్రూరత్వాన్ని ఆశ్రయించటం లేదు. అందుకు బదులుగా కవిత్వాన్ని ఆశ్రయిస్తున్నారు.
టిబెటన్ల ప్రవాస అనుభవానికి స్పందనగా దలైలామా ‘ఎప్పుడూ వదులుకోవద్దు’ అంటూ ఇచ్చిన కవితా సందేశం ఇది: ‘‘ఏం జరిగినా/ హృదయాభివృద్ధిని ఎప్పుడూ వదులుకోవద్దు/ కరుణతో ఉండండి/ మీ స్నేహితులతో మాత్రమే కాదు/ అందరితో కరుణతో ఉండండి/ మీ హృదయంలో ప్రపంచంలో/ శాంతి కోసం పని చేయండి/ హృదయాభివృద్ధిని ఎప్పుడూ వదులుకోవద్దు/ మీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే’.
టిబెటన్ ప్రవాసులకు కవిత్వం ఒక రకమైన సృజనాత్మక ప్రతిఘటన. రాజకీయ అణచివేతను ఎదుర్కొంటూ, తమ గుర్తింపును కాపాడుకోవడానికి కవిత్వం వారికి ఒక సాధనం. ప్రవాస టిబెటన్ల నుంచి మూడు తరాలుగా మాతృదేశ విముక్తి కోసం అనేక విధాల కవిత్వం వస్తూనే ఉంది. వారిలో ప్రముఖంగా రాస్తున్న వారు వందమంది కంటే ఎక్కువగానే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ కవిత్వంతో ప్రభావితమవుతున్నారు, దానిలో వ్యక్తీకరించబడిన వేదనలో పాలుపంచుకుంటున్నారు.
టిబెట్ సమకాలీన కవిత్వంలో టెన్జిన్ సుండు, భుచుంగ్ డుమ్రా సోనమ్ లాంటి కవులు, తమ కవితలలో బౌద్ధ తాత్త్వికతను జోడించి, ప్రవాసం, ఆశ, నిరసన వంటి భావాలను వ్యక్తీకరిస్తున్నారు. ఈ కవిత్వం కేవలం మతపరమైన ఉపదేశాలను మాత్రమే ప్రతిబింబించడం లేదు, జీవన పోరాటాన్ని ఎదుర్కోవడంలో ఒక మానసిక సాధనంగా కవిత్వం ఉపయోగపడుతున్నది. తమ వ్యాసాలు, కథలు, కవితలు, వెలుగు చూడడానికి ఒక ప్రచురణ సంస్థని వెబ్‌సైట్లని, వారికి వారే నెలకొల్పుకున్నారు.
‘‘తెల్లని గులకరాళ్ళను ఏరుకో/ విచిత్ర వింత ఆకుల్నీ/ వంపుల్ని చుట్టూ కొండల్ని గుర్తుంచుకో/ నీకు అవసరం కావొచ్చు/ మళ్ళీ ఇంటికి రావడానికి,’’ అని బహిష్కరించబడిన ప్రముఖ కవి రచయిత, టెన్జిన్ సుండూ అశపడుతూనే ఉంటాడు. ‘‘నేను టిబెటన్‌ని/ కానీ టిబెట్‌కు చెందినవాడిని కాదు/ ఎప్పుడూ అక్కడకు వెళ్లలేదు/ అయినా నేను కలలు కంటూనే ఉంటాను/ అక్కడే చనిపోదామని’’ అంటాడు.
‘‘నా వెదురు వేణువు ధ్వని/ గాఢంగా ఉన్నపుడు/ ఆహ్వానం లేకుండా/ పక్షులు నా చుట్టూ తిరిగాయి/ ఇప్పుడు ఈ విరిగిన వేణువు నిస్సార ధ్వని/ సముద్రకాకుల దృష్టినైనా ఆకర్షించడం లేదు’’ అని వాపోతాడు దివంగత కవి న్గోడుప్ పాల్జోర్. టిబెట్, హిందీ, సంస్కృతం, పాలీ, థాయ్, ఇంగ్లీష్ భాషలలో నిష్ణాతుడైన న్గోడుప్ పాల్జొర్ హవాయి విశ్వవిద్యాలయంలో పనిచేసేవాడు.
‘‘పాలుతాగే పసివాడిగా ఉన్నపుడు/ భూమ్యాకాశాలగురించి, నేనెప్పుడూ అనుకోలేదు/ కానీ నాకు ఒక అస్పష్ట అభిప్రాయం ఉండేది/ మాతృభూమి కౌగిలంత తీయదనం/ ప్రపంచంలో ఏదీ లేదని’’ – చైనా సైన్యంలో దుబాసిగా, అధ్యాపకుడిగా పనిచేసి, కవిత్వంతో అనేక ప్రయోగాలు చేసిన రబ్ గై భసంగ్ అంటాడు.
‘‘జీవితాన్ని నేను నిర్వచించను/ మరణం నాకు తెలియదు/ రోజులు నేను చూడను/ రాత్రులు నేను తెలుసుకోను/ అస్పష్టత మాత్రమే రాజ్యమేలుతుంది/ ఒక వెర్రి బిందువు వరకూ గందరగోళం/ శాశ్వతంగా కరిగిపోతుంది/ శూన్యంలో మనసు మునిగిపోయింది/ చీకటి నన్ను గుల్ల చేస్తూ/ ఉదాత్తమైన కోలాహలపు లోతైన సొరంగం నుండి/ ఉన్మాద స్థితికి ఎదిగి/ సంపూర్ణ నిశ్శబ్దంలో శబ్దం చేస్తూ నేను బయటకొచ్చాను’’ అంటాడు ప్రముఖ టిబెట్ కవి, అనువాదకుడు, సంపాదకుడు భుచుంగ్ డుమ్రా సోనమ్.
టిబెట్, ఇంగ్లీష్, హిందీ భాషలలో రాసే కవయిత్రి సోనమ్ త్సోమో చాషుట్సాంగ్. ఆమె అమెరికాలో ఉండగా తన తల్లి మరణించిన తర్వాత నలభై తొమ్మిది రోజుల ‘బార్డో’ గురించి కవిత్వం రాసుకున్నది (‘బార్డో’ అంటే మరణానికి పునర్జన్మానికి మధ్య ఉంటుందని బౌద్ధులు భావించే సమయం): ‘‘నేను ఈ అసౌకర్య/ తెలియని ప్రదేశంలో ఉన్నాను. అక్కడ నా తల్లి కుమార్తెగా నేను ఏమి చేయాలో నాకు తెలియదు. ఇక్కడ నేనూ, నా ఆలోచనలు మాత్రమే, నాకు తెలిసిన ఏకైక విషయం. నలభై తొమ్మిది రోజులు, రోజులు గడిచేకొద్దీ వాటిని కవితలుగా రాసుకున్నాను. నా జీవితంలో ఆ కష్ట సమయంలో నా భావాలు ఏమిటో కాగితం మీద చూసుకుందుకు’’ అని ఆమె చెప్పుకుంది.
‘‘ఇసుకలో చెల్లాచెదురయిన విత్తనాలు/ వికసించాలన్న దాహంతో ఉంటాయి/ బృందగానంలో కోల్పోయిన పాటలు/ వినబడాలని ఆకాంక్షతో ఉంటాయి’’ – అని ఆశపడుతూనే ఉండేవాడు, దివంగత కె. ధోండప్ ప్రముఖ కవి, చరిత్ర కారుడు, పాత్రికేయుడు.
టిబెటన్ల వర్తమానం గురించి, వారి మాతృభూమి పరిస్థితి గురించి, ప్రస్తుత దలైలామా తమ్ముడు టెన్జిన్ చోగ్యాల్ ఇలా చెప్పుకున్నాడు – ‘‘కాలిపోతున్న భవనంలోంచి బయటకు పరుగెత్తే పిల్లాడు, దానినుండి బయటపడడానికి శక్తిలేనివాడు, వాడు చేయగలిగినదల్లా, ‘మంటలు, మంటలు’ అని అరవగలగడమే. బలమైన వ్యక్తులు, పెద్దలెవరో వింటారని, ఎవరో ఒకరు పట్టించుకుంటారని, వాడిని రక్షించడానికి ఏదో ఒక చర్య తప్పకుండా తీసుకుంటారని ఆశపడతాడు. ఖచ్చితంగా అదే మనం టిబెట్ వాసులం చేస్తున్నాం. మన ఇల్లు శిథిలమైపోతోంది. మన బంధువులు అక్కడ ఉన్నారు. అది ఇప్పటి టిబెట్ పరిస్థితి. మనం ప్రపంచమంతటా నివసిస్తున్న నిర్వాసిత ప్రజలం అయిపోయాం. ప్రస్తుత చైనా ఆక్రమిత టిబెట్‌లో మన బంధువులను రక్షించుకుందుకు, మన ఇంటిని చేరుకుందుకు, మానవాళికి విన్నవించుకుందుకు మనం ఆ పిల్లడిలానే ఏడుస్తున్నాం.’’ అని చెప్పుకున్నాడు. అది ఎంత వాస్తవమో కదా అనిపిస్తుంది టిబెట్ ప్రవాస కవిత్వాన్ని చదివినప్పుడు.
ముకుంద రామారావు
99083 47273
ఈ వార్తలు కూడా చదవండి..
శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని
సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్
For More AP News And Telugu News