NHAI: ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రీ బుకింగ్ ప్రారంభం!
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:56 AM
ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రీ బుకింగ్‌ను మంగళవారం అర్ధరాత్రి నుంచే భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రారంభించింది.
రూ.3 వేలతో రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ లేదా ఎన్‌హెచ్‌ఏఐ వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చు
నేటి అర్ధరాత్రి నుంచే పాస్ యాక్టివేషన్
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రీ బుకింగ్‌ను మంగళవారం అర్ధరాత్రి నుంచే భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రారంభించింది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్‌హెచ్‌ఏఐ వెబ్‌సైట్ ద్వారా రూ.3 వేలు చెల్లించి ఈ పాస్ ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఈ వార్షిక పాస్‌ను ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం అర్ధరాత్రి నుంచే వార్షిక పాస్ యాక్టివేషన్స్ మొదలవనున్నాయి. యాక్టివేషన్ అయిన తర్వాత నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు ఈ వార్షిక పాస్ చెల్లుబాటవుతుంది. ఆ తర్వాత మళ్లీ రీచార్జ్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే సాధారణ ఫాస్టాగ్ తరహాలోనే చెల్లింపులు జరుగుతాయి. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో వార్షిక పాస్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కేవ లం జాతీయ రహదారులపైనే ఈ వార్షిక పాస్ చెల్లుతుంది. అంటే నేషనల్ హైవే (ఎన్‌హెచ్)లు, నేషనల్ ఎక్స్‌ప్రె్‌సవే (ఎన్‌ఈ)లపైన మాత్రమే.. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని హైవేలపై ఇది వర్తించదు. అక్కడి టోల్‌ప్లాజాల కోసం కచ్చితంగా ఫాస్టాగ్‌లో నగదును ఉంచుకోవాలి. ఈ వార్షిక పాస్ వాణిజ్య వాహనాలకు వర్తించదు.
తప్పనిసరి కాదు..
ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి ఈ వార్షిక పాస్ విధానం ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇది తప్పనిసరి కాదని.. ప్రయాణాలు, వాటికి చెల్లిస్తున్న టోల్ చార్జీలను బేరీజు వేసుకుని కూడా తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక ప్రతి టోల్‌ప్లాజాకు ఒక ట్రిప్పుగా లెక్కిస్తారు. ఒకవేళ క్లోజ్డ్ టోల్‌ప్లాజాలుంటే.. రెండు ట్రిప్పులకు కలిపి ఒకటిగా లెక్కిస్తారు. రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ప్రయాణించే మార్గంలో ఉన్న జాతీయ రహదారుల వివరాలు తెలుస్తాయి. యాప్ లో టోల్ ప్లాజాలున్న ప్రాంతాలు, అక్కడ ఎంత చార్జీ ఉందనే వివరాలున్నాయి. అలాగే వార్షిక పాస్‌తో తిరిగిన ట్రిప్పుల వివరాలు కూడా కనిపిస్తాయి. నమోదు చేసుకున్న ఫోన్ నంబరుకు టోల్‌ప్లాజా దాటిన ప్రతిసారి సందేశాల రూపంలో సమాచారం వస్తుంది.