National Women Commission: ‘స్వాతి’ హత్యపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వండి
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:42 AM
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐదు నెలల గర్భిణి స్వాతి హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
రాష్ట్ర డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ
శరీర భాగాల కోసం మూసీలో కొనసాగుతున్న గాలింపు
హైదరాబాద్/ న్యూఢిల్లీ/ హైదరాబాద్ సిటీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐదు నెలల గర్భిణి స్వాతి హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. పథకం ప్రకారం స్వాతిని హత్య చేసిన ఆమె భర్త.. మృతదేహాన్ని ముక్కలు చేసి వాటిని ప్రతాపసింగారం సమీపంలోని మూసీ నదిలో పారేశాడు. అయితే, ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను మూడు రోజుల్లోగా తమకు అందజేయాలని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్‌కర్ తెలంగాణ డీజీపీకి నోటీసు పంపారు. కాగా, ఈ హత్య కేసులో మేడిపల్లి పోలీసులు స్వాతి భర్తను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరోపక్క, స్వాతి శరీర భాగాల కోసం మూసీ నదిలో గాలింపు కొనసాగుతోంది. పోలీసులు, జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలు మూడు రోజులుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే, తల, ఇతర శరీర భాగాలను ప్యాక్ చేసిన ప్లాస్టిక్ కవర్లకు ఇటుకలు, బండరాళ్లు కట్టి మూసీలో పడేసినట్లు నిందితుడు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శరీరభాగాలు మూసీలోని బురదలో కూరుకుపోయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, మూసీలో వరద తీవ్రత తగ్గిన తర్వాతే గాలింపు చర్యల్లో సత్ఫలితం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.