Tourism: నల్లమలలో పర్యాటకం పరుగులు !
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:26 AM
అబ్బురపర్చే పచ్చటి అందాలు.. ముచ్చట గొలిపే జలపాతాలు.. ఆహ్లాదపర్చే వాతావరణం.. అందమైన వన్యప్రాణులు.. ప్రముఖ శైవ క్షేత్రాలు.. ఇలా ప్రకృతి రమణీయతతో కట్టిపడేసే నల్లమల ఇక పర్యాటకులకు స్వర్గధామం కానుంది.

7,700 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్
రోప్ కార్.. కృష్ణా నదిపై తీగల వంతెన
చేయూత అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం
పర్యాటక అభివృద్ధికి 242 కోట్లతో ప్రణాళిక.. 25 కోట్లు విడుదల రాష్ట్రం
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): అబ్బురపర్చే పచ్చటి అందాలు.. ముచ్చట గొలిపే జలపాతాలు.. ఆహ్లాదపర్చే వాతావరణం.. అందమైన వన్యప్రాణులు.. ప్రముఖ శైవ క్షేత్రాలు.. ఇలా ప్రకృతి రమణీయతతో కట్టిపడేసే నల్లమల ఇక పర్యాటకులకు స్వర్గధామం కానుంది. ఈ ప్రాంతాన్ని దేశంలోనే పెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్రప్రభుత్వం ముందడుగు వేసింది. కేంద్రంకూడా ఇందుకు చేయూతనిస్తూ నల్లమలలోని అటవీ ప్రాంతం గుండా శ్రీశైలం వరకు రూ.7,700 కోట్ల వ్యయంతో హైవే ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని తలపెట్టడంతో నల్లమల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నా యి. ఇందులో భాగంగా నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూర్‌లోని కుంచోనిమూల, దుర్వాసుల చెరువు, ఫర్హాబాద్, వటువర్లపల్లి, దోమలపెంట మీదుగా ప్రత్యేకంగా బ్రిడ్జిని నిర్మిస్తారు. కృష్ణానదిపై తీగల వంతెన నిర్మించి శ్రీశైలానికి ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేస్తారు.
దీని కారణంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా 24 గంటలు ప్రయాణం చేసే వెసులుబాటు కలుగుతుంది. అలాగే, నల్లమలలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.242 కోట్లతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఇందులో రూ.142 కోట్లు సాయం చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. కాగా, అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. శ్రీశైలం ఉత్తర ద్వారం ఉమామహేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నందున ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ భావిస్తోంది. ఇందుకోసం మన్ననూర్ కుంచోనిమూల నుంచి ఉమామహేశ్వర క్షేత్రం వరకు రోప్‌కార్ వ్యవస్థను రూపొందించాలని పర్యాటక శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.