Local Body Elections: పదవి కావాలంటే పైసలు పంచాల్సిందే..
ABN , Publish Date - Dec 09 , 2025 | 07:56 AM
గియ్యాల నీవు మంచోడవా పెద్దోడివా అని జనం సూత్తలేరు. ఎన్ని పైసలు ఖర్చు పెడతడు అని చూత్తరు.. గిది గియ్యాల పరత్తితి-సర్పంచ్ అభ్యర్థి ఒక సామన్యుడి మధ్య జరిగిన సరదా సంభాషణ నేటి రచ్చబండ..
మిర్యాలగూడ, వ్యవసాయం(ఆంధ్రజ్యోతి): ఏందన్నా, పైసల్లేకుండనే ఎలచ్చన్ల నిలబడ్డవా ఏంది... అస్సలు పైసలు తీత్తలేవ్.. ఊకనే తిరిగి పచారం చేస్తున్నవ్.. దండాలు దస్కాలు పెట్టి సేతులు కాళ్లు పడుతున్నవ్. గయినా జనం నీకల్లి ఓర సూపు కూడా సూత్తలేరు. గిట్టయితే నీకు ఓట్లు ఓరు ఏస్తరన్నా సెప్పు. అరే తమ్మి నువు సెప్పింది నిజమే.. పైసల్లేకుంటే రాజకీయం ఏడుంది.. గియ్యాల నీవు మంచోడవా పెద్దోడివా అని జనం సూత్తలేరు. ఎన్ని పైసలు ఖర్చు పెడతడు అని చూత్తరు.. గిది గియ్యాల పరత్తితి-సర్పంచ్ అభ్యర్థి ఒక సామన్యుడి మధ్య జరిగిన సరదా సంభాషణ నేటి రచ్చబండ..
సామాన్యుడు : ఏందన్నా అంతా మంచిగేనా. గీ సారి ఊళ్ల సర్పంచ్గా పోటీ చేత్తున్నవ్ అంటగా, నీ తానా పైసలున్నయా లెవ్వా. ఏందీ కథ..
అభ్యర్థి : నువు సెప్పింది నిజమే తమ్మి. సర్పంచ్ కావాలని కోరికతో ఓ పార్టీ పెద్దాయన దగ్గరి పొయినా గప్పుడు గాయన ఏమన్నడంటే. పైసల్లేంది పనికిరావ్ నీ తాన ఎన్ని పైసలు ఉన్నయి. ఎలచ్చన్ల ఎంత ఖర్సు పెడతవ్ అడిగిండు. నువు సెపితే గపుడు ఆలోచిత్తా అన్నడు. నేనొక గింత పెడతా అని సెప్పిన గపుడు సరే అన్నడు.
సామాన్యుడు : అయితే నీ తాన పైసలు ఉన్నయా అన్నా... మరి ఎందుకన్న ఎలచ్చన్లు ఇంక వారం రోజుల్లో పెట్టుకుని పైసలు బయటకు తీస్తలేవ్.
అభ్యర్థి : అరే తమ్మీ.. గియాల గిట్టనే తిరగాలే. గిప్పుడు పైసలు ఇస్తే.. ఓటేసి నాటికి జనం మరిసిపోతరు. అప్పటికి మళ్ళీ సేతులు చాత్తరు. గిప్పటి నుంచే పైసలు పంచుతే మన తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు సరిపోక అప్పులు పాలయితం.
సామాన్యుడు : ఊక తిరిగి దండాలు దస్కాలు పెడుతుండ్రు. పైసలిస్తలేరేoది.. అని జనం అనుకుంటున్నరు. గందుకే అడిగినా జర గరం కాకే అన్నా. మీ తాత దండ్రుల నుంచి మీ కుటుంబం శానా రోజులు రాజకీయాల్లో ఉన్నరు. మీకు శానా మంచి పేరుంది. గప్పట్లో ఊరి కోసం ఎంతో సేసిండ్రు కదా. అయినా జనం ఓట్లకు పైసలు ఆశిస్తున్నరేందన్నా.
అభ్యర్థి : అదే తమ్మీ ఏ కాలంలో ఉన్నవ్. ఇది కలికాలం. మూడు పాళ్ళు అధర్మం. ఒక పాలు ధర్మం ఉంటదంట. గియాల మంచికి ఇలువ లేదు. పైసలుంటే సాలు అళ్లకే జనాలు నీరాజనాలు పలుకుతరు. గెట్ల సంపాదించిండు అనే ఇషయాన్ని జనం పట్టించుకోట్లే.
సామాన్యుడు : నిజం సెప్పినవ్ అన్నా.. ప్రతోనికి పైసల మీద యావ ఎక్కువయింది. మన తాన పైసల్లేకుంటే. ఇంట్లోళ్లే పట్టించుకోరు. ఇంక జనం సంగతి సెప్పేదేముందిలే.
అభ్యర్థి: పదవి కావాలంటే పైసలు ఇయ్యాల్సిందే.. మందు పంచాల్సిందే.. లేక పోతే ఓటేసే పరిత్తితి లేదు.మేం ఊకనే ఓట్లు ఎయ్యాం అంటున్నరు.. ఇంటి మీద కొచ్చి పంచాయతీ చేసేకాడికి తయారండ్రు జనం.. ఏం సేద్దాం సెప్పు...
సామాన్యుడు : జనం గిట్ట తయారయినాక మీ లాంటోళ్లు ఏం సేత్తరు అన్నా.. పైసలు పంచాల్సిందే పదవి కొట్టాల్సిందే.
అభ్యర్థి : ఎలచ్చన్ల పైసలు పంచినాంక ఊరును బాగు పరసాలంటే గెట్ట సాధ్యమయింది సెప్పు. పెట్టిన పైసలు ఎట్ట భర్తీ చేసుకోవాలనే ఆలోచన సేత్తం. గంత కంటె మేం ఏం సేయలేం తమ్మీ. జనంతో పాటు మనం అంతే..
సామాన్యుడు : ఈ జనం మారరు అన్నా ఆళ్లు అంతే... పోయెత్త అన్నా..
ఇవి కూడా చదవండి
రిజర్వేషన్‌లు కలిసిరాని చోట రహస్య ఒప్పందాలు