Local Body Elections: రిజర్వేషన్‌లు కలిసిరాని చోట రహస్య ఒప్పందాలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 07:44 AM
శత్రువుకు శత్రువు మిత్రుడు అనే రీతిలో వివిధ పార్టీల అభ్యర్ధుల మధ్య ఒప్పందాలు కుదురుతున్నాయి. ఇంతకాలం ప్రత్యర్థులుగా ఉన్నవాళ్లు ప్రస్తుతం ఒకటవుతున్నారు.
ఇల్లందకుంట, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): 'ఈసారి రిజర్వేషన్లు కలిసి రాలేదు. మనలో మనకు గొడవలెందుకు.. ఒక్కటైతే పోలా.. ఈ సారి నాకు అవకాశం వచ్చింది.. నీకు రిజర్వేషన్ అనుకూలించక పోయే.. ఏం చేద్దాం... నేను పోటీలో ఉంటున్నా.. ఎంపీటీసీ నీకే.. మనోడిని విత్ డ్రా చేసుకొమ్మని చెప్పు' అంటూ రిజర్వేషన్లు కలిసిరాని చోట పార్టీలకతీతంగా నాయకులు ఏకతాటిపైకి వస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో నాకు మద్దతు ఇవ్వు, ఎంపీటీసీ ఎన్నికల్లో నిన్ను గెలిపించే బాధ్యత నాది, నన్ను నమ్ము అంటూ బేరసారాలు చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు పోటీ చేస్తున్న పంచాయతీల్లోనూ అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు. సర్పంచ్‌గా ఓ పార్టీకి చెందిన వర్గానికి మద్దతు ఇస్తే మరో పార్టీకి చెందిన వర్గానికి ఉపసర్పంచ్ పదవిని ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు.
శత్రువుకు శత్రువు మిత్రుడు...
శత్రువుకు శత్రువు మిత్రుడు అనే రీతిలో వివిధ పార్టీల అభ్యర్ధుల మధ్య ఒప్పందాలు కుదురుతున్నాయి. ఇంతకాలం ప్రత్యర్థులుగా ఉన్నవాళ్లు ప్రస్తుతం ఒకటవుతున్నారు. కొన్ని గ్రామాల్లో నాయకులు సర్పంచ్ పదవి కోసం విభేదాలు పక్కన పెట్టి ఏకమయ్యారు. మరి కొందరు గెలిచిన తర్వాత ఏటు వీలైతే అటు పోదామని చూస్తున్నారు. పార్టీలు బలహీనంగా ఉన్న గ్రామాల్లో నాయకులు ఒకరికొకరు మద్దతు ఇవ్వాలని అవగాహనకు వస్తున్నారు. బీఆర్ఎస్ వీక్‌గా ఉన్నచోట కాంగ్రెస్, కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు బేరసాలు నడుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
పల్లెల్లో ఆత్మీయ పలకరింపులు.. జోరుగా విందులు
అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్..!