Srisailam Project: శ్రీశైలానికి ఐదేళ్లలో కొత్త గేట్లు పెట్టాలి!
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:54 AM
శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మార్చాలని భారీ ప్రాజెక్టు గేట్ల నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు చెప్పారు. మరో ఐదేళ్లలో కొత్త గేట్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
లేదంటే ‘తుంగభద్ర’ పరిస్థితే
ప్రాజెక్టుల నిపుణుడు కన్నయ్య నాయుడు
దోమలపెంట, జూలై 6 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మార్చాలని భారీ ప్రాజెక్టు గేట్ల నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు చెప్పారు. మరో ఐదేళ్లలో కొత్త గేట్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం చేస్తే గత ఏడాది తుంగభద్ర డ్యాం పరిస్థితే శ్రీశైలం ప్రాజెక్టుకూ ఎదురయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన శ్రీశైలం ప్రాజెక్టును అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుతం డ్యామ్ 10వ క్రస్టు గేటు నుంచి స్వల్పంగా(10 శాతం కంటే తక్కువగా) నీరు లీకవుతోందని తెలిపారు. దీనివల్ల ఇబ్బంది లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగి 40 ఏళ్లయిందని తెలిపారు. 2010 తర్వాత క్రస్టు గేట్లకు పెయింటింగ్ వేయలేదని గుర్తుచేశారు. సకాలంలో పెయింటింగ్ చేయడం వల్ల గేట్ల మన్నిక పెరుగుతుందని చెప్పారు. ప్లంజ్‌పూల్‌తో ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందీ లేదని, అది జలాశయం నుంచి 60 మీటర్ల దూరంలో ఉందని తెలిపారు. ప్రాజెక్టు పరిశీలనలో కన్నయ్య నాయుడితో ఇంజనీర్లు ఉన్నారు.