Share News

BJP: ఐక్యతా స్ఫూర్తి.. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ

ABN , Publish Date - Jul 07 , 2025 | 01:43 AM

దేశంలో ఇద్దరు ప్రధాన మంత్రులు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదని పోరాడిన నేతగా శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ చరిత్రలో నిలిచిపోతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.

BJP: ఐక్యతా స్ఫూర్తి.. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ

  • ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఆర్టికల్‌ 370 రద్దు

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌/బేగంపేట/హైటెక్‌ సిటీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఇద్దరు ప్రధాన మంత్రులు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదని పోరాడిన నేతగా శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ చరిత్రలో నిలిచిపోతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ప్రధాని మోదీ ఆర్టికల్‌ 370ని రద్దు చేశారని తెలిపారు. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. ఒకే దేశం-ఒకే చట్టం-ఒకే రేషన్‌-ఒకే ఎన్నికలు అన్న భావనను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. దేశ సమగ్రత కోసం ప్రతీ కార్యకర్తా శ్రమించాలని కోరారు.


శ్యామా ప్రసాద్‌.. పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిదాత అని అన్నారు. చిన్న వయసులోనే అనేక పోరాటాలు చేసి కశ్మీర్‌ సమస్యపై దీటుగా పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. కాగా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఏటా ఐటీ ఉద్యోగులు బోనాల ఉత్సవాలను జరుపుకోవడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌(టీటా) ఆధ్వర్యంలో మాదాపూర్‌ ఐటీ కారిడార్‌లో చిన్న పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద ఆదివారం జరిగిన బోనాల ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.


బ్రాహ్మిణ్‌ ఎక్సెలెన్స్‌ సత్కారం

సెంటర్‌ ఫర్‌ బ్రాహ్మిణ్‌ ఎక్సెలెన్స్‌ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద ర్‌రావును సన్మానించారు. బేగంపేటలోని పుష్పగిరి పీఠాధిపతి విద్యా శంకరభారతి స్వామి.. రాంచందర్‌రావును ఆశీర్వదించారు. అనంతరం సెంటర్‌ ఫర్‌ బ్రాహ్మిణ్‌ ఎక్సెలెన్స్‌ ప్రతినిధులు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ వాణీదేవి, అరవిందరావు, జ్వాలా నరసింహారావు, వేణుగోపాలచారి, మాధవీలత, రాజీవ్‌శర్మ, రామచందర్‌రావు తదితరులు సన్మానించారు.

Updated Date - Jul 07 , 2025 | 01:43 AM