Bachupally: ట్రావెల్ బ్యాగే పట్టించింది!
ABN , Publish Date - Jun 06 , 2025 | 03:33 AM
హతురాలెవరో తెలియదు! నిందితుడిని పట్టుకునే క్రమంలో ఎక్కడికక్కడ సీసీఫుటేజీని పరిశీలించినా ఫలితం లేకపోయింది! అయితే మృతదేహాన్ని తరలించేందుకు ఏ బ్యాగు అయితే అనువుగా ఉంటుందని భావించాడో.. అదే బ్యాగు నిందితుడిని పట్టించింది.
బాచుపల్లి మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ
హతురాలు, నిందితుడు నేపాల్ వాస్తవ్యులు
ఇద్దరి మధ్య వివాహేతర బంధం
హత్యచేశాక బ్యాగులో శవాన్ని కుక్కి నిర్మానుష్య ప్రదేశంలో వదిలివేత
నిజాంపేట్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): హతురాలెవరో తెలియదు! నిందితుడిని పట్టుకునే క్రమంలో ఎక్కడికక్కడ సీసీఫుటేజీని పరిశీలించినా ఫలితం లేకపోయింది! అయితే మృతదేహాన్ని తరలించేందుకు ఏ బ్యాగు అయితే అనువుగా ఉంటుందని భావించాడో.. అదే బ్యాగు నిందితుడిని పట్టించింది. ఈ మేరకు బాచుపల్లి పరిధిలో ట్రావెల్ బ్యాగులో గుర్తుతెలియని మహిళ మృతదేహం తాలూకు మిస్టరీని పోలీసులు 24గంటల్లోనే ఛేదించారు. పోలీసుల కథనం ప్రకారం.. హతురాలు, నిందితుడు ఇద్దరూ నేపాలీలే! తారా బెహరా (33), విజయ్ తోపా (30) నేపాల్‌లో పక్కపక్క గ్రామాల్లో ఉంటారు. ఇద్దరికీ పరిచయమేర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే తారకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. విజయ్ అవివాహితుడు. గత ఏప్రిల్‌లో తార.. తన ఇద్దరు పిల్లలను వదిలేసి విజయ్‌తో కలిసి నేపాల్ నుంచి హైదరాబాద్ వచ్చింది. విజయ్ సోదరుడు జూబ్లీహిల్స్‌లోని బస్తీలో నివాసం ఉంటూ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పనిచేసేవాడు. అక్కడే విజయ్, తార కొన్నాళ్లు నివాసం ఉండి.. కొన్ని రోజుల క్రితం బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీకి మకాం మార్చారు. అక్కడ విజయ్ ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తుండగా, తార ఇంటివద్దే ఉంటోంది. ఇటీవల తార గర్భం దాల్చింది.
ఇది నచ్చని విజయ్, ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తానొక్కడినే పని పూర్తిచేయాలనుకున్నాడు. మే 23న ఇంట్లో తారను మంచం నవారుతో గొంతు బిగించి చంపాడు. అదేరోజు బాచుపల్లిలోని రాందేవ్ బ్యాగుల దుకాణానికి వెళ్లి.. మృతదేహం పట్టేంత పెద్దదైన ఓ ట్రావెల్ బ్యాగ్‌ను కొని ఇంటికి తెచ్చాడు. ఆ బ్యాగులో మృతదేహాన్ని కుక్కి.. జిప్ బిగించాడు. ఆ బ్యాగును తలపై పెట్టుకొని రెండు కి.మీ దూరంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి అక్కడ బ్యాగును పడేశాడు. సమీప ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులు ‘ట్రావెల్ బ్యాగును నిందితుడు ఎక్కడ కొని ఉంటాడు?’ అనే కోణంలో విచారణ ప్రారంభించారు. నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి ప్రాంతాల్లోని దాదాపు 70 దుకాణాల్లో విచారణ చేశారు. చివరకు బాచుపల్లిలోని రాందేవ్ బ్యాగుల దుకాణంలో నిందితుడు బ్యాగును కొన్నట్లుగా గుర్తించారు. ట్రావెల్ బ్యాగ్‌ను కొన్నాక ర్యాపిడో ద్వారా బుక్ చేసుకున్న బైక్‌పై అతడు ఇంటికి వెళ్లినట్టు అక్కడి సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. జూబ్లిహిల్స్‌లో సోదరుడి వద్ద ఉన్న నిందితుడిని గురువారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు ఒకట్రెండురోజుల్లో వెల్లడించనున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News