MLC elections: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేడే
ABN , Publish Date - Feb 27 , 2025 | 05:05 AM
రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ- వరంగల్- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన పోలింగ్ గురువారం జరగనుంది.
రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి..
ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల దాకా
ఉపాధ్యాయుల ఓటుకు రేటు!
వెయ్యి నుంచి 3 వేల చొప్పున పంపిణీ!
కరీంనగర్, నల్లగొండ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ- వరంగల్- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన పోలింగ్ గురువారం జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయం త్రం 4 గంటల లోపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ పత్రాలు, బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రితో పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు బుధవారమే చేరుకున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో 3,55,159 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 27,088 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రులు ఓటు వేసేందుకు 499, ఉపాధ్యాయులకు 274 కలిపి మొత్తం 773 కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులోని 93 కామన్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరోపక్క, నల్లగొండ- వరంగల్- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 25,797 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నియోజకవర్గం 12 జిల్లాల్లోని 191 మండలాల్లో విస్తరించగా మొత్తం 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ఓటింగ్ నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మూడు స్థానాలు.. 90 మంది అభ్యర్థులు
రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల కలిపి మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి, బీఎస్పీ అఽభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవీందర్‌సింగ్ సహా 56 మంది బరిలో ఉన్నారు. ఇదే జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, పీఆర్‌టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, జాక్టో అభ్యర్థి ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి సహా 15 మంది పోటీ చేస్తున్నారు. ఇక, నల్లగొండ -వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (టీఎ్‌సయూటీఎఫ్), పింగళి శ్రీపాల్‌రెడ్డి (పీఆర్‌టీయూటీఎస్), గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి (టీపీఆర్‌టీయూ), పులి సర్వోత్తంరెడ్డి (బీజేపీ), పూల రవీందర్ (మాజీ ఎమ్మెల్సీ, బీసీ జేఏసీ), సుందర్‌రాజ్‌యాదవ్, మరో 13మంది పోటీలో నిలిచారు.
ఒక్క ఓటరు.. ఎనిమిది మంది సిబ్బంది
మహదేవ్‌పూర్ రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఒకే ఒక ఓటరు కోసం ఓ పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులకు ఎనిమిది మంది సిబ్బందిని కూడా కేటాయించారు. పలిమెల మండలంలో పదికి పైగా ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. పంకెన గ్రా మంలో మాత్రమే ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు చెందిన ఒకేఒక్క ఉపాధ్యాయుడు ఓటరుగా నమోదయ్యారు. ఆ ఉపాధ్యాయుడి కోసం పలిమెలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా.. ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఐదుగురు పోలింగ్ సిబ్బంది, ఒక రూట్ ఆఫీసరు, ఇద్దరు పోలీసులు బుధవారం సాయంత్రమే అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆ ఉపాధ్యాయుడు ఓటు హక్కును వినియోగించుకుంటారో? లేదో ? చూడాలి మరి..!!