MLA Sujana Chowdary Injury: ఎమ్మెల్యే సుజనా చౌదరి కుడి భుజానికి గాయం
ABN , Publish Date - May 07 , 2025 | 06:10 AM
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి లండన్‌లో ప్రమాదవశాత్తూ పడిపోవడంతో కుడి భుజానికి తీవ్ర గాయం కలిగింది. హైదరాబాద్‌లో కిమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది.
ఐదారు ముక్కలైన ఎముక .. కిమ్స్‌లో శస్త్ర చికిత్స
హైదరాబాద్ సిటీ, మే 6 (ఆంధ్రజ్యోతి): విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కుడి భుజానికి తీవ్ర గాయమైంది. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఓ సూపర్ మార్కెట్‌లో ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. కుడి భుజం వద్ద ఎముక విరగడంతో శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం ఆయన్ను బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఎండీ, చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఏవీ గురవారెడ్డి నేతృత్వంలో నలుగురు డాక్టర్ల బృందం అవసరమైన పరీక్షలు చేశారు. భుజంలో ఎముక ఐదారు ముక్కలైనట్లు గుర్తించారు. నాలుగు గంటల పాటు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని గురవారెడ్డి తెలిపారు. నెల నుంచి రెండు నెలల పాటు ఫిజియోథెరపీ అవసరమన్నారు. ఆ తర్వాత ఆయన ఆ చేతితో అన్ని పనులూ యథావిధిగా చేసుకోవచ్చని చెప్పారు.