Madhusudhan Reddy: కన్నెపల్లి దగ్గరికొస్తే తాట తీస్తాం!
ABN , Publish Date - Jul 08 , 2025 | 03:41 AM
కన్నెపల్లి, కల్వకుర్తి పంప్ హౌస్‌ల దగ్గరికి వస్తే తాట తీస్తామని హరీశ్‌రావును దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు.
హరీశ్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి హెచ్చరిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రె్‌సదే గెలుపు: దానం
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కన్నెపల్లి, కల్వకుర్తి పంప్ హౌస్‌ల దగ్గరికి వస్తే తాట తీస్తామని హరీశ్‌రావును దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు నీళ్లు నింపితే ఏమవుతుందో అందరికీ తెలుసని చెప్పారు. ప్రాజెక్టుల నుంచి రైతులకు ఎప్పుడు నీళ్లు విడుదల చేయాలో ప్రభుత్వానికి తెలుసన్నారు. సోమవారం సీఎల్పీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు నిల్వ చేస్తే అది కూలిపోవడం ఖాయమని ఎన్డీఎ్‌సఏ తేల్చి చెప్పిందని, ఆ సూచనలనే ప్రభుత్వం పాటిస్తోందని స్పష్టం చేశారు.
‘ముచ్చుమర్రి నుంచి కృష్ణా నీళ్లను ఏపీ తోడుకు పోతోంటే బీఆర్‌ఎస్ సర్కారు పదేళ్లు పట్టించుకోలేదు. కల్వకుంట్ల కుటుంబం అవినీతిపై విచారణ జరుగుతుంటే.. ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బనకచర్ల అంశాన్ని ముందుకు తెచ్చారు. ’అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రె్‌సదే గెలుపని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చే విషయం అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు. గాంధీభవన్‌లో ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు, ప్రజల నుంచి దానం వినతిపత్రాలు స్వీకరించారు.