Chief Minister Revathi Reddy Announced: 21 ఏళ్లకే ఎమ్మెల్యే!
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:05 AM
దేశ భవిష్యత్తును యువత నిర్ణయించాలనే ఉద్దేశంతో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఓటుహక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.....
పార్లమెంటులో చట్ట సవరణ చేయాలి
గాంధీ పేరు దేశానికి పర్యాయపదం
మతతత్వవాదులు బ్రిటిషర్ల కన్నాప్రమాదం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రె్‌సపై కుట్ర
బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు
రాజీవ్ సద్భావన సంస్మరణలో ముఖ్యమంత్రి
నమ్మకానికి మారుపేరు యాదవులు
రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తాం
సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ/కవాడిగూడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): దేశ భవిష్యత్తును యువత నిర్ణయించాలనే ఉద్దేశంతో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఓటుహక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే అర్హత వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ పరిపాలనా యంత్రాంగంలో 21 ఏళ్లకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును 21 ఏళ్లకు ఎందుకు తగ్గ్గించరాదని ప్రశ్నించారు. అందుకే ఎమ్మెల్యేగా పోటీచేసే అర్హత వయసును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ త్వరలో రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి పార్లమెంటులో చట్టసవరణ చేస్తే.. రాజకీయాల్లో యువత మరింత క్రియాశీలంగా మారుతుందని చెప్పారు. ఆదివారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ దినోత్సవం సందర్భంగా చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘గాంధీ పేరు దేశానికి పర్యాయపదం. తమపై పోరాడిన మహాత్మాగాంధీని బ్రిటిషర్లు ఏమీ చేయలేకపోయారు. స్వాతంత్య్రం వచ్చిన కొద్ది నెలల్లోనే మతతత్వవాదులు ఆయనను పొట్టన పెట్టుకున్నారు. గాంధీని హత్య చేసినవారు బ్రిటిషర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడటానికి గాంధీ, ఇందిర, రాజీవ్ ప్రాణాలు కోల్పోయారు‘‘ అని రేవంత్ అన్నారు. గాంధీ కుటుంబం దేశంలో శాంతి, సామరస్యాన్నికాపాడుతోందని, మూడు తరాలుగా దేశం కోసం పని చేస్తోందని తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని స్పూర్తిగా తీసుకుని ఎస్సీ వర్గీకరణతో పాటు కులగణన చేశామన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాలతో కాంగ్రె్‌సపై కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. ఈ కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్‌గా మారిందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకపోవడానికి కూడా ఈ రెండు పార్టీలే కారణమని అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో 37ు ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్.. ఆ తర్వాత నాలుగు నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయింది. 22ు బీఆర్‌ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి.? ఎవరెవరి మధ్యలో అవగాహన ఉంది.? ఎవరు ఎవరిని బలపరుస్తున్నారో అర్థం చేసుకోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ ఇదే తతంగాన్ని కొనసాగించాలని ఈ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి. ఈ కుట్రలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిద్దాం’’ అని సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఇస్తున్న రాజీవ్ సద్భావనా అవార్డును కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు బహూకరించారు. ఈ కా ర్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాలరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు.
నమ్మకానికి మారుపేరు యాదవులు..
యాదవులు నమ్మకానికి మారుపేరు అని, మాట ఇస్తే కట్టుబడి ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నమ్మినవారి కోసం ఎంత కష్టమొచ్చినా, నష్టమొచ్చినా అండగా నిలుస్తారని తెలిపారు. యాదవుల సహకారంతోనే హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడులకు ఆదర్శనగరంగా మారిందని, నగరంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నామని చెప్పారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో, అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో సదర్‌ను పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం వచ్చాక సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి నిధులు అందిస్తున్నామని చెప్పారు. వైఎంసీఏలో 1985లో ప్రారంభమైన సదర్ నుంచి ఇప్పటివరకు తాను ఉత్సవంలో పాల్గొంటున్నానని, యాదవోంకా ఖదర్.. హైదరాబాద్ సదర్ అని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవుల సహకారం ఎంతో అవసరమని, సంక్షేమం, రాజకీయ రంగంలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. ఏ సమస్య ఉన్నా.. ప్రభుత్వం వద్దకు రావాలని, అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అతిథులకు సాంస్కృతిక కళాకారులు బోనాలు. కోలాటం, డప్పు, డోలు వాయిద్యాలు, బ్యాండ్ మేళాతో స్వాగతం పలికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రదాన వేదిక వద్ద కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. జంటనగరాలలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన యాదవులు తమ దున్నపోతులను సర్వాంగ సుందరంగా అలంకరించి వాటితో చేయించిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, వాకిటి శ్రీహరి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ అనిల్ కుమార్‌యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, సదర్ సమ్మేళన్ ప్రతినిధులు పాల్గొన్నారు.