Secretariat: సచివాలయం ఎదుట అందాల భామలు అందాలొలికే..
ABN , Publish Date - May 19 , 2025 | 04:18 AM
సాయం సంధ్యవేళ.. హుస్సేన్‌సాగర తీరాన.. విద్యుత్ కాంతుల వెలుగుల్లో.. రాష్ట్ర సచివాలయంలో అందాల భామలు సందడి చేశారు. పరిపాలనకు గుండెకాయ.. ప్రజల సంక్షేమం కోసం విధానాల రూపకల్పన జరిగే తెలంగాణ సచివాలయాన్ని ప్రపంచ సుందరి పోటీదారులు ఆదివారం సాయంత్రం సందర్శించారు.
సచివాలయంలో ప్రపంచ సుందరీమణుల సందడి
తెలంగాణ తల్లి విగ్రహానికి అందాలభామల నివాళి
తెలంగాణ పిండి వంటకాలతో ప్రభుత్వం తేనీటి విందు
వెయ్యికిపైగా డ్రోన్లతో ఆకట్టుకునేలా ‘డ్రోన్ షో’
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శన
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): సాయం సంధ్యవేళ.. హుస్సేన్‌సాగర తీరాన.. విద్యుత్ కాంతుల వెలుగుల్లో.. రాష్ట్ర సచివాలయంలో అందాల భామలు సందడి చేశారు. పరిపాలనకు గుండెకాయ.. ప్రజల సంక్షేమం కోసం విధానాల రూపకల్పన జరిగే తెలంగాణ సచివాలయాన్ని ప్రపంచ సుందరి పోటీదారులు ఆదివారం సాయంత్రం సందర్శించారు. తొలుత సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం విగ్రహం ముందు నిలబడి ఫొటో దిగారు. ఆ తరువాత కొద్దిసేపు అక్కడ కలియదిరిగారు. అనంతరం సచివాలయం మధ్యలో పచ్చికబయళ్లపై ఏర్పాటుచేసిన తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. సుందరీమణులకు పసందైన తెలంగాణ పిండి వంటకాలతోపాటు మిర్చి బజ్జీ, పునుగులు, ఇరానీ చాయ్ సహా పలురకాల చిరు తిళ్లు, ప్రత్యేకమైన ఐస్‌క్రీమ్‌లను అందించారు.
అభివృద్ధిపై ప్రత్యేక వీడియో ప్రదర్శన

మిస్‌వరల్డ్ పోటీదారులు సచివాలయానికి వచ్చిన సందర్భంగా తెలంగాణ చరిత్ర, అభివృద్ధి, పారిశ్రామిక విధానాలు సహా పలు అంశాలతో కూడిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. వందల ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతం ఎలా ఉండేది, ప్రత్యేకించి హైదరాబాద్ ప్రాంతం ఎలా ఉన్నది, ఏయే రంగాల్లో ప్రాముఖ్యత కలిగి ఉందనే విషయాలతోపాటు చార్మినార్ నిర్మాణం, దాని చరిత్రకు సంబంధించిన విషయాలన్నింటినీ ఆ వీడియోలో చూపించారు. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆలయాలు, జాతరలకు సంబంధించి కూడా వివరించారు. ఇక సాగునీటి రంగం, పంటల అంశాలకు సంబంధించి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు పలు అంశాలను ప్రత్యేకంగా వివరించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలు, పలు రంగాల వృద్ధి కోసం రూపొందించిన పాలసీలు, విదేశీ పెట్టుబడులు, ఇక్కడ కంపెనీల ఏర్పాటుకు ఉన్న అవకాశాల గురించి సవివరంగా ఆ వీడియోలో చూపించారు. మిస్‌వరల్డ్ పోటీదారులకు సచివాలయంలో స్వా గతం పలికేందుకు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి దాస రి హరిచందన, ఉపముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
పోటీదారులు కాదు.. రాయబారులు..
మిస్‌వరల్డ్ పోటీదారులను ఉద్దేశించి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. ‘మీరు కేవలం పోటీదారులు మాత్రమే కాదు.. మీ దేశాల రాయబారులుగా మేం గుర్తుంచుకుంటాం. మీతోపాటు తెలంగాణ ఆత్మను మీ దేశాలకు తీసుకెళ్లి అక్కడి ప్రజలకు మా రాష్ట్రం గురించి తెలియజేయండి’’ అని అన్నారు. ఈ రోజు చార్మినార్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చనిపోవడం బాధాకరమని, వారికి నివాళిగా ఒక్క నిమిషం మౌనం పాటిద్దామని అన్నారు. సచివాలయానికి ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా కూడా హాజరయ్యారు. ఆమెతో మంత్రి జూపల్లి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ సహా పలువురు ముచ్చటించారు.
కమాండ్ సెంటర్‌లో ముద్దుగుమ్మలు
సచివాలయం సందర్శనకు ముందు ఆదివారం మధ్యాహ్నం ప్రపంచ సుందరి పోటీదారులు బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను పరిశీలించారు. తొలుత బస్సుల్లో అక్కడికి చేరుకున్న ముద్దుగుమ్మలకు పోలీస్ అశ్వికదళం, పైపు బ్యాండ్, మోటర్ సైకిల్ రైడర్స్, స్నిప్పర్ డాగ్ స్క్వాడ్‌లతో పోలీస్ శాఖ ఘనంగా స్వాగతం పలికింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడిటోరియంలో పోలీస్ శాఖ పనితీరు విధానంపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మాదక ద్రవ్యాల నివారణ కోసం తెలంగాణ పోలీస్ చేపట్టిన చర్యలకు అందాలభామలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పోస్టర్లపై సంతకాలు చేసి.. సందేశాలు రాసారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు ేసవలందిస్తున్న ట్రాన్స్‌జెండర్లతో కలసి ఫొటో దిగారు.
ట్యాంక్‌బండ్‌పై ‘సన్‌డే ఫన్‌డే’
కవాడిగూడ/ఖైరతాబాద్: సచివాలయంలో జరిగిన ప్రపంచ సుందరీమణుల కార్యక్రమాన్ని ట్యాంక్‌బండ్ నుంచి సందర్శకులు వీక్షించేలా అక్కడ ప్రత్యేక ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేశారు. దీంతో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ‘సన్‌డే ఫన్‌డే’ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. సచివాలయం ముందు తెలుగుతల్లి చౌరస్తా సమీపంలో ఏర్పాటుచేసిన పలు దేశాల జాతీయ జెండాల్లో ఇజ్రాయెల్ జెండాను తొలగించడం వివాదాస్పదమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనను నిందితులు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి వైరల్ చేయడంతో ఆ జెండాను తొలగించిన వారిపై కేసు నమోదైంది.
ఆకట్టుకున్న ‘డ్రోన్ షో’..
సచివాలయం బయట పచ్చికబయళ్లలో ఏర్పాటుచేసిన కుర్చీల్లో అందాలభామలు ఆసీనులై.. వెయ్యి డ్రోన్లతో ప్రదర్శించిన ‘డ్రోన్ షో’ను తిలకించారు. డ్రోన్ షోలో మిస్‌వరల్డ్ లోగో, తెలంగాణ జరూర్ ఆనా లోగోలు కనిపించినప్పుడు హర్షం వ్యక్తం చేశారు. సాయంత్రం 5.30 గంటలకు సచివాలయానికి వచ్చిన సుందరీమణులు 7.50 గంటల వరకు అక్కడే ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నివాళి అర్పించే సమయంలో రాష్ట్ర గేయం ‘జయ జయహే తెలంగాణ’ను వినిపించారు. జాతీయ గీతంతో తేనీటి విందు కార్యక్రమం ముగిసింది.
చాయ్ మస్తుంది..

తెలంగాణ వంటకాలు బాగున్నాయి. కొంచెం కారంగా ఉన్నాయి. అయినా ఇష్టంగా తింటున్నా. ఇప్పుడు వేసవికాలం కావడంతో ఉక్కపోత బాగా ఉంది. మేముంటున్న హోటల్‌లో కూడా పలు రకాలు వంటలు పెడుతున్నారు. చాయ్ చాలా బాగుంది.
-మిస్ క్రొయేషియా
హాలీమ్ యమ్మీ..యమ్మీగా ఉంది..

తెలంగాణ రాష్ట్రం నాకు బాగా నచ్చింది. ఇక్కడ చూడడానికి చాలా ప్రాంతాలున్నాయి. హైదరాబాదీ బిర్యానీ సూపరుంది. ఇక హాలీమ్ అయితే యమ్మీ.. యమ్మీగా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే.. ఇక్కడి కొన్ని వంటకాలను నేను మా దేశానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. మిస్ వరల్డ్ పోటీల తరువాత కొన్ని దేశాలు తిరగాలని ప్లాన్ చేసుకున్నా. కానీ ఇప్పుడు నా మనసు మార్చుకున్నా.. నా కుటుంబంతో కలిసి మళ్లీ తెలంగాణకు వస్తా. అప్పుడు ఇంకొన్ని పర్యాటక ప్రాంతాలను కూడా చూసేస్తా.
-మిస్ ఆస్ట్రేలియా, జాస్మిన్ స్ట్రింగర్.
ఆటోగ్రాఫ్.. ఓ స్వీట్ మెమరీ

సచివాలయ సందర్శనకు వచ్చిన సుందరీమణులతో అక్కడున్న చాలామంది ఫొటోలు దిగారు. మరికొంత మంది వారి ఆటోగ్రా్‌ఫలను తీసుకున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతీఒక్కరూ ఫొటోలు దిగుతూ.. అవకాశం దొరికినవారి నుంచి ప్రత్యేక పుస్తకాలపై సంతకాలు చేయించుకున్నారు. ఓ బుడతడు మాత్రం అక్కడున్న పలు దేశాలకు చెందిన అందగత్తెల ఆటోగ్రా్‌ఫలు తీసుకుంటూ కనిపించాడు.
ఈ వార్తలు కూడా చదవండి
Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన
Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత
For Telangana News And Telugu News