Chief Secretary of Tourism: తాజ్‌మహల్‌ను చూసినట్టు తెలంగాణను చూస్తారు
ABN , Publish Date - May 07 , 2025 | 04:09 AM
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా జరగనున్నాయి. ఈ పోటీలు రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడతాయని జయేశ్ రంజన్ తెలిపారు.
రాష్ట్ర భవిష్యత్తును మార్చే పోటీలివి
కేవలం వీఐపీల కార్యక్రమం కాదు మాన్యులూ పాల్గొనే అవకాశం
అందాల పోటీల ఖర్చు రూ.54 కోట్లు.. ఇందులో ప్రభుత్వం భరిస్తున్నది రూ.2కోట్లే
‘ఆంధ్రజ్యోతి’తో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): ‘‘మన దేశానికి విదేశీ పర్యాటకులు పెద్దఎత్తున వస్తున్నారు. చాలా మంది తాజ్‌మహల్ చూసేందుకు ఆగ్రా, వారసత్వ కట్టడాలు చూసేందుకు జైపూర్, బీచ్ కోసం గోవా, పర్యాటకం కోసం కేరళ వెళ్తున్నారు. తక్కువ మంది మాత్రమే తెలంగాణకు వస్తున్నారు. అదే విదేశీ పర్యాటకులతోపాటు ఇతర రాష్ట్రాలవారు కూడా తెలంగాణకు పెద్దఎత్తున వచ్చేలా చేయడమే ప్రపంచ సుందరి పోటీల వెనుక ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం’’ అని మిస్ వరల్డ్ పోటీల ఇన్‌చార్జి, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా ఈ నెల 10 నుంచి 31 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. తెలంగాణ హస్తకళలు, సంస్కృతిని లోకానికి పరిచయం చేయబోతున్నామని తెలిపారు. ఈ పోటీలు పర్యాటకరంగంలో రాష్ట్ర భవిష్యత్తును మారుస్తాయన్నారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న సీఎం లక్ష్యానికి అనుగుణంగా పోటీల ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ సుందరి పోటీల ఏర్పాట్లు, విశేషాలపై ఆయన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు.. ఆయన మాటల్లోనే..
కొత్త అనుభూతి పొందడం ఖాయం..
‘‘ఈ నెల 10న గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. వేల సంఖ్యలో సందర్శకులు హాజరవుతారు. అక్కడ కొన్నేళ్లుగా ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోవడంతో ఏర్పాట్లకోసం సమయం పడుతోంది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది గచ్చిబౌలి స్టేడియంలో అనేక అంతర్జాతీయ క్రీడాపోటీలు జరగనున్నాయి. నేను తెలంగాణ క్రీడల కార్యదర్శిగా కూడా ఉన్నాను. అందువల్ల భవిష్యత్తులో క్రీడలకు ఉపయోగపడేలా, పనులు శాశ్వతంగా నిలిచిపోయేలా గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రారంభ పోటీలకు హజరయ్యేవారు కొత్త అనుభూతిని పొందుతారు.
భద్రతపై నేరుగా సీఎం సమీక్షలు..
ప్రస్తుతం పాక్‌తో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దానికితోడు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలకం కావడంతో.. ప్రపంచ సుందరి పోటీల భద్రతా ఏర్పాట్లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిరోజూ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన 120 దేశాల ప్రతినిధులు సురక్షితంగా తిరిగి వెళ్లేందుకు చర్యలు చేపడుతున్నాం. కొందరు ఈ పోటీలను వ్యతిరేకిస్తున్నారు. నిరసన తెలిపాలని భావిస్తున్నారు. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తున్న తరుణంలో.. అలాంటి నిరసనలు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తాయి. నిరసన తెలిపేవారిని పోలీసు శాఖ గుర్తించి తగిన చర్యలు చేపడుతోంది.
చేనేత..విశ్వవ్యాప్తం
తెలంగాణ చేనేత, హస్తకళల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తాం. వివిధ దేశాల నుంచి వచ్చిన అందగత్తెలతో రాష్ట్రంలోని ప్రముఖ చేనేత గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం. శిల్పారామంలో చేనేత ఉత్పత్తులకు ప్రపంచ అందగత్తెలు ప్రత్యేకంగా ప్రచారం చేస్తారు. కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతను లోకానికి చాటిచెప్పేలా కార్యక్రమాలు ఉంటాయి. నేను ఇప్పుడు ధరించినది ఇక్కత్ జాకెట్ (తను ధరించిన జాకెట్‌ను చూపిస్తూ). ఉదయం నుంచి ఎండలో తిరుగుతున్నా ఉక్కపోతగానీ, వేడిగానీ అనిపించలేదు. ఈ విషయాన్ని సహచర అధికారికి చెబితే.. ఆయన వెంటనే ఇలాంటివి కొన్ని ఆర్డర్ ఇచ్చారు. చేనేత ఉత్పత్తులను స్వయంగా ఉపయోగించడంతోపాటు ఇతరులకూ చెప్తే.. విక్రయాలు పెద్దఎత్తున పెరుగుతాయి. ప్రపంచ సుందరి పోటీల తర్వాత చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది.
సామాన్యులూ పాల్గొనే అవకాశం..
ప్రపంచ పోటీలంటే వీఐపీల కార్యక్రమం అనుకుంటారు. ఆ ఆలోచనను మార్చి సామాన్యులూ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రపంచ సుందరి పోటీల్లో ప్రజలు కూడా పాల్గొనే అవకాశం కల్పించాం. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ కార్యక్రమం, అందగత్తెల క్రీడా పోటీలు, శిల్పకళా వేదికలో టాలెంట్ షో, ఫ్యాషన్ షో, బ్యూటీ విత్ పర్పస్ తదితర కార్యక్రమాలకు ప్రజలను అనుమతిస్తాం. ఆసక్తి ఉన్నవారు పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అనుమతులిస్తాం.
వృధా కాదు.. భవిష్యత్తుకు బాటలు..
అందాల పోటీల పేరిట పెద్దఎత్తున ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ కొందరు చేస్తున్న విమర్శలు అర్థరహితమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అతి తక్కువ ఖర్చుతో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. పోటీలకు మొత్తం రూ. 54 కోట్లు ఖర్చవుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం సగం, ప్రపంచ పోటీల నిర్వహణ సంస్థ సగం భరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 27 కోట్లలో రూ.25 కోట్ల వరకు స్పాన్సర్లు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం చేసే ఖర్చు రూ.2 కోట్ల వరకే ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం దేశంలోని అనేక రాష్ట్రాలు, ఇతర దేశాలు పోటీపడ్డాయి. సీఎం ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ కార్యక్రమంతో తెలంగాణకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయి’’ అని జయేశ్ రంజన్ వెల్లడించారు.