Nandini Gupta: రామప్పను సందర్శించిన మిస్ ఇండియా నందినిగుప్తా
ABN , Publish Date - Apr 27 , 2025 | 04:21 AM
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని 2023 మిస్ ఇండియా నందిని గుప్తా శనివారం సందర్శించారు. ఆమెకు ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు.
రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
వెంకటాపూర్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని 2023 మిస్ ఇండియా నందిని గుప్తా శనివారం సందర్శించారు. ఆమెకు ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రామలింగేశ్వరుడికి నందిని గుప్తా ప్రత్యేక పూజలుచేశారు. ఆమెకు పర్యాటకశాఖ జిల్లా అధికారి శివాజీ నేతృత్వంలో టూరిజం గైడ్లు రామప్ప ఆలయ చరిత్ర, రామప్పలోని మదనిక సాలబంజికల చరిత్రను వివరించారు. రాళ్లను కరిగించి పోతపోసి మలిచిన శిల్పాలను నందిని గుప్తా ఆసక్తిగా తిలకించారు.
అపురూప శిల్ప సంపదకూ.. అద్భుత నిర్మాణ రీతులకు నెలవైన రామప్ప ఆలయం జగద్విఖ్యాతం, కాకతీయుల నాటి నిర్మాణాలకే తలమానికం. వచ్చే నెల ఏడో తేదీ నుంచి 31 వరకూ హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే సుందరీమణులు సందర్శించేందుకు వీలుగా సర్కారు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా మే 14న రామప్ప గుడిని సుందరీమణులు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన మిస్ ఇండియా నందిని గుప్తా ముందుగానే రామప్ప ఆలయాన్ని సందర్శించడం పాధాన్యం సంతరించుకున్నది.