Vivek Venkatswamy: అండగా ఉంటాం ఆదుకుంటాం
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:01 AM
భారీ వర్షాలు, వరదలు వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు దామోదరరాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, ధనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు.
వరద బాధితులకు దామోదర, వివేక్ భరోసా
కేంద్రం ఆర్థిక సాయం అందించాలి: సీతక్క
మెదక్, కామారెడ్డి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదలు వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు దామోదరరాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, ధనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో వర్షాల వల్ల దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో మంత్రులు దామోదర, వివేక్ వేర్వేరుగా పర్యటించగా.. మంత్రి సీతక్క కామారెడ్డిలో పరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. పోచారం డ్యామ్ పరిస్థితి దృష్ట్యా ముందుజాగ్రత్తగా పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజలతో మంత్రి వివేక్ స్వయంగా మాట్లాడి దైర్యం చెప్పారు. అలాగే, హవేళీఘనపూర్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించిన వివేక్.. లింగ్సాన్‌పల్లి తండా-తిమ్మాయిపల్లి మార్గంలో దెబ్బతిన్న వంతెను, కోతకు గురైన బూర్గుపల్లి రోడ్డును పరిశీలించారు. ఇక, మెదక్ జిల్లా రామాయంపేటలో పర్యటించిన మంత్రి దామోదర రాజనర్సింహ వరద బాధితులతో మాట్లాడారు. అలాగే, కామారెడ్డి రోడ్డులోని బీసీ కాలనీలో ముంపునకు గురైన కుటుంబాలను పరామర్శించారు.
పాక్షికంగా కూలిన ఇండ్లను పరిశీలించారు. కాగా, గత 50 ఏళ్లలో జిల్లాలో ఈ స్థాయిలో వర్షాలు ఎప్పుడూ కురవలేదన్న మంత్రి దామోదర.. భారీ వర్షాలకు వరదలో చిక్కుకున్న 60మందిని ప్రభుత్వ యంత్రాంగం కాపాడిందని ఈ సందర్భంగా తెలిపారు. ఇక, భారీ వర్షాలు, వరదలు తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చాయని, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆమె మాట్లాడారు. వరద నష్టంపై నివేదికలు తెప్పించి నష్టనివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 1,044 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.