Thummala Nageshwar Rao: యూరియా ఆందోళనలు కపట నాటకం
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:23 AM
యూరియా కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన ఆందోళన ఓ కపట నాటకమంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.
కాళేశ్వరంపై చర్చను పక్కదారి పట్టించాలని బీఆర్‌ఎస్ ఎత్తు
వరి వేస్తే ఉరి అన్నవారే నీతులు చెబుతున్నారు: మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన ఆందోళన ఓ కపట నాటకమంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. శనివారం వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ నిర్వహించిన నిరసనపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ‘‘యూరియా కొరతకు కారణం రాష్ట్ర ప్రభుత్వమా? కేంద్ర ప్రభుత్వమా? అనేది మీకు తెలియదా?’’ అని బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చను పక్కదారి పట్టించేందుకే నిరసన కార్యక్రమం పేరుతో బీఆర్‌ఎస్ దిగజారుడు రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ‘‘జియో పాలిటిక్స్ ఒకవైపు.. డిమాండ్‌కు తగ్గట్లు దేశీయ ఉత్పత్తి లేకపోవడం మరోవైపు యూరియా కొరతను సృష్టిస్తుంటే.. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? రేవంత్ పాలనలో మూడు పంటకాలాల్లో యూరియా కొరత లేని విషయం మీకు తెలియదా? కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించకుండా.. రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?’’ అని అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
వరి వేస్తే ఉరి అన్నవారు ఇప్పుడు తమకు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. ‘‘బీఆర్‌ఎస్ హయాంలో.. ఏ ఒక్క ఏడాదీ రైతుల కోసం రూ.20 వేల కోట్లకు మించి ఖర్చు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే రూ.32,408 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసింది. గతంలో ఏకకాలంలో రుణ మాఫీ చేయకపోవడంతో.. రైతులపై రూ.8,515 కోట్ల అధిక వడ్డీ భారం పడింది. కాంగ్రెస్ పాలనలో ఏకకాలంలో రూ.2 లక్షలలోపు రుణాలను పరిగణనలోకి తీసుకుని, నెలలోపే రూ.20,616.89 కోట్లను మాఫీ చేశాం. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్‌ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఆ యూరియా సరఫరాలో జాప్యంపై నేను స్వయంగా కేంద్ర మంత్రులను కలిసి, పలుమార్లు విజ్ఞప్తి చేశాను’’ అని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పాలనలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘రామగుండం ఎరువుల కర్మాగారం 85 రోజుల పాటు పనిచేయకపోవడం బీఆర్‌ఎస్ నేతలు చూడలేదా? బీఆర్‌ఎస్ కపట నాటకాలను నమ్మే స్థితిలో రైతులు లేరు. రైతుల ముసుగులో బీఆర్‌ఎస్ చేస్తున్న నాటకాలను ప్రజలు చీత్కరించుకుంటున్నారు’’ అంటూ తుమ్మల దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి:
కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌పై మాటల యుద్ధం..
15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..