Share News

Minister Sridhar Babu: ఐటీమంత్రి శ్రీధర్‌బాబు ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

ABN , Publish Date - Aug 02 , 2025 | 09:47 AM

ప్రజా ప్రభుత్వం వచ్చాకే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఐటీశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కర్మన్‌ఘాట్‌లోని కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు పలువురు హాజరయ్యారు.

Minister Sridhar Babu: ఐటీమంత్రి శ్రీధర్‌బాబు ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

- ప్రజాప్రభుత్వం వచ్చాకే సంక్షేమ పథకాలు

- ఐటీశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్: ప్రజా ప్రభుత్వం వచ్చాకే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఐటీశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridharbabu) అన్నారు. కర్మన్‌ఘాట్‌లోని కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ప్రభుత్వ చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు మల్‌రెడ్డి రాంరెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి, కార్పొరేటర్లు వెంకటేశ్వర్‌రెడ్డి, సుజాతానాయక్‌, జోనల్‌ కమిషనర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్‌రెడ్డిలు హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఎల్బీనగర్‌ పరిధిలోని లబ్ధిదారులకు మంజూరు అయిన కొత్త రేషన్‌ కార్డులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రజల గౌరవాన్ని పెంచే ఆలోచన చేస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజల బతుకుల్లో ఏదో మార్పు వస్తుందన్న ఆశతో ఎదురు చూశారన్నారు. కానీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం ఒక్క రేషన్‌ కార్డు ఇచ్చే ఆలోచన కూడా చేయలేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల వరకు అప్పులు చేసి కూర్చుంటే వాటిపై ప్రతి నెల 7వేల కోట్ల వడ్డి కట్టాల్సి వస్తోందన్నారు. అయినప్పటికీ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నామన్నారు.


ఎంత ఆర్థికభారమైనప్పటికీ ప్రభుత్వం భరించి ప్రజలకు ఒక్కపైసా ఖర్చు లేకుండా రేషన్‌కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నదన్నారు. ప్రభుత్వం ఏమి చేస్తున్నదని అడిగే వారికి జవాబు చెప్పాల్సిన అవసరం కూడా మీపై ఉన్నదన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా వేలాది మందికి రేషన్‌కార్డు ద్వారా సన్నబియ్యం అందించే కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వమని ఆయన చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఏమి కావాలి వారిలో ఏ మార్పు తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు.


అందులో భాగంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ సన్నబియ్యం అందించాలన్న ఆలోచన చేయడం జరిగిందన్నారు. ఇల్లులేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. గతపదేళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్‌ ఒన్‌ పరీక్షలు నిర్వహించలేదన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ పరీక్షలు నిర్వహించి దాదాపు 65వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. పేద వారికి భారం ఎలా తగ్గించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని దానికి రాష్ట్రపతి ఆమోదం ఇప్పించాల్సిన బాధ్యత తీసుకోవాలని ఇక్కడి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను కోరుతున్నానన్నారు.


ప్రభుత్వ చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజాసంక్షేమంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌, రోడ్డుడెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూ పించి మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ లక్ష్మీప్రసన్న రామ్మోహన్‌గౌడ్‌, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్లు వేణుగోపాల్‌, జానకి, డీఎస్ఓ వనజాత, ఏఎస్ఓ పుల్లయ్య, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ సుజాత, వైకుంఠం, సూర్యప్రకాష్ గుప్తా పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే

సైబర్‌ నేరగాళ్ల సరికొత్త ఎత్తులు!

Read Latest Telangana News and National News

Updated Date - Aug 02 , 2025 | 09:47 AM