Share News

Migrant Workers: కాలిపోతున్న బతుకులు!

ABN , Publish Date - Jul 01 , 2025 | 03:47 AM

బతుకు దెరువు కోసం పొట్టచేతబట్టుకుని వస్తున్న వలస కూలీలు.. అనుకోని ప్రమాదాల బారిన పడుతున్నారు. పరిశ్రమలు, గోదాముల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నవారు కొందరైతే...

Migrant Workers: కాలిపోతున్న బతుకులు!

  • పదేళ్లలో జరిగిన అగ్నిప్రమాదాల్లో 600 మందికిపైగా సజీవ దహనం

  • మృతుల్లో ఎక్కువగా వలస కూలీలే

హైదరాబాద్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): బతుకు దెరువు కోసం పొట్టచేతబట్టుకుని వస్తున్న వలస కూలీలు.. అనుకోని ప్రమాదాల బారిన పడుతున్నారు. పరిశ్రమలు, గోదాముల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నవారు కొందరైతే... కాళ్లు, చేతులు కోల్పోయి దివ్యాంగులుగా మారుతున్న వారు మరికొందరు. సాధారణంగా వలస కూలీల్లో చాలా మంది హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లోని పరిశ్రమలు, గోదాముల్లో కూలీలుగా చేరుతుంటారు. అలాంటి చోట్ల అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు... మరణించే వారిలో వలస కూలీలే ఎక్కువగా ఉంటున్నారు. గతంలో షాద్‌నగర్‌లో, జీడిమెట్ల పారిశ్రామిక వాడలో, హైదరాబాద్‌ నడిబొడ్డున నాంపల్లి ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదాల్లోనూ వలస కూలీలే ఎక్కువగా మృతి చెందారు. తాజాగా పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో మృతులు, గాయపడ్డ వారు, ఆచూకీ లేకుండా పోయిన వారిలోనూ అత్యధికులు వలస కూలీలే. 2014 నుంచి 2024 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అగ్నిప్రమాదాల్లో 600మందిపైగా మృతి చెందినట్లు అగ్నిమాపక శాఖ వద్ద లెక్కలు ఉన్నాయి.


మృతుల్లో బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. పరిశ్రమలు, గోదాముల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. సమాచారం అందుకుని అగ్నిమాపక శాఖ శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నా... మంటల్ని అదుపు చేసే పరిస్థితి లేకుండా పోతుంది. ప్రమాణాల మేరకు నిర్మాణాలు లేకపోవడంతో సహాయక చర్యల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని సార్లు అక్కడ పనిచేసే సిబ్బందికి మంటల్ని అదుపు చేయడంపై అవగాహన లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. దీనికితోడు అగ్నిమాపక శాఖ తనిఖీలు లోపించడం.. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిబంధనల ప్రకారం 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండే భవనాల్లో అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్న పరిశ్రమలు, గోదాములు ఎత్తు 15మీటర్ల కంటే తక్కువగా ఉండటంతో అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి. దీని ఫలితంగా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరుగుతోంది

Updated Date - Jul 01 , 2025 | 03:47 AM