Sigachi Industries CEO: సిగాచి సీఈఓ అమిత్ రాజ్ అరెస్ట్
ABN , Publish Date - Dec 28 , 2025 | 01:16 PM
పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఏడాది 30వ తేదీన సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించింది.
హైదరాబాద్, డిసెంబర్ 28: రియాక్టర్ పేలి 54 మంది మృతి చెందిన సిగాచి పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హాను పటాన్ చెరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. 2025 జూన్ 30వ తేదీన పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు మరణించారు. అంతా సజీవ దహనమయ్యారు. వారిలో కొంత మంది ఆచూకీ నేటికి లభ్యం కాలేదు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారు.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఈ ప్రమాద సమయంలో సిగాచి పరిశ్రమలో 143 మంది కార్మికులు ఉన్నారు. వారిలో 61 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాదంలో మృతదేహాలు గుర్తిపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అయితే ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగి దాదాపుగా కొన్ని నెలలు కావస్తున్నా.. నేటికి సిగాచి పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హాను అరెస్ట్ చేయకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.