Kuntloor: కుంట్లూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Apr 27 , 2025 | 04:46 AM
రంగారెడ్డి జిల్లా కుంట్లూర్‌లో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 400 గుడిసెలు కాలిపోయాయి, దీంతో వేలాది మంది నిరాశ్రయులైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి సహాయం కోరుతున్న బాధితులు, అగ్ని ప్రమాదానికి కారణమైన గ్యాస్ సిలిండర్ పేలడం అని పేర్కొన్నారు
400 గుడిసెలు బుగ్గి.. నిరాశ్రయులైన వేలాదిమంది
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ రావినారాయణరెడ్డి కాలనీలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీని ధాటికి సుమారు 400 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. కుంట్లూర్‌లోని భూదాన్ భూమిలో మూడేళ్ల క్రితం సీపీఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేశారు. అక్కడ వేలాది మంది నివాసం ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఓ గుడిసెలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఆ ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు మరింత వ్యాప్తి చెంది పక్కనున్న గుడిసెలకు అంటుకున్నాయి. అలా ఒకదాని తర్వాత మరో దానికి మంటలు అంటుకుని సుమారు 400 గుడిసెలు కాలి బూడిదయ్యాయి.
స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వేసవి కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని వారు చెప్పారు. తమవారు చాలా మంది పనులకు వెళ్లడంతో తమకు కనీసం గుడిసెల్లో ఉన్న నిత్యావసర వస్తువులు, దుస్తులు, పిల్లల పుస్తకాలు, వంట సామగ్రితో పాటు ఇతర విలువైన వస్తువులు తీసుకునే సమయం కూడా లేకపోయిందని గుడిసెవాసులు బోరున విలపించారు. తాము సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. కాగా, మంటలను సమీపంలోని 7 వేల గుడిసెలున్న ప్రాంతానికి వ్యాప్తి చెందకుండా సీపీఐ నాయకులు, స్థానికులు జాగ్రత్త పడడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై తనకు అనుమానాలున్నాయని, అధికారులు విచారణ జరిపి ఇందులో కుట్ర కోణం దాగి ఉంటే వెలికి తీయాలని కోరారు. కాగా, ఎన్ని గుడిసెలు కాలిపోయాయో సర్వే నిర్వహించి, ప్రకృతి వైపరీత్యం కింద బాధితులకు సాయం అందిస్తామని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ తెలిపారు. ఘటనా స్థలిని రాచకొండ సీపీ సందర్శించారు. ప్రమాద కారణాలపై విచారణ జరిపిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News