Share News

Manjira Barrage: మంజీరా బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు

ABN , Publish Date - Jun 27 , 2025 | 04:21 AM

హైదరాబాద్‌ జంటనగరాలతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించే మంజీరా బ్యారేజీ ప్రమాదంలో పడింది.

Manjira Barrage: మంజీరా బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు

  • డేంజర్‌లో జంట నగరాలకు తాగునీరు అందించే డ్యామ్‌

  • మేడిగడ్డ తరహాలో మంజీరా దిగువ భాగంలో

  • కొట్టుకుపోయిన ఆప్రాన్‌.. బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు

  • మరమ్మతులు లేక దెబ్బతిన్న గేట్లు.. బలహీనపడ్డ కట్టలు

  • పూర్తిస్థాయిలో నీటి నిల్వ శ్రేయస్కరం కాదు

  • ఎస్డీఎ్‌సవో నిపుణుల బృందం నివేదిక

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ జంటనగరాలతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించే మంజీరా బ్యారేజీ ప్రమాదంలో పడింది. బ్యారేజీకి తక్షణమే మరమ్మతులు చేయకపోతే భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీలో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఏ మాత్రం శ్రేయస్కరం కాదని రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ (ఎస్డీఎ్‌సఓ) తేల్చిచెప్పింది. జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం-2021 ప్రకారం ఏర్పాటైన ఎస్డీఎ్‌సఓ ఆధ్వర్యంలో నిపుణుల బృందం గత మార్చి 22న బ్యారేజీని పరిశీలించి నివేదికను సమర్పించింది. బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లర్లకు(పియర్ల)కు పగుళ్లు వచ్చాయని గుర్తించింది. తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో మట్టికట్ట బలహీనమైందని, ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో గేట్లు, స్పిల్‌ వేలోని కొంత భాగం సైతం దెబ్బతిందని నివేదిక పేర్కొంది. వరద ఉధృతితో కోతకు గురయ్యే చోట ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోతే అది క్రమంగా డ్యామ్‌ వరకు విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రోజూ 10 కోట్ల గ్యాలన్ల నీరు అందించే ఈ బ్యారేజీ హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ నిర్వహణలో ఉంది.


కాళేశ్వరం బ్యారేజీలాగే...

మంజీరా బ్యారేజీ నుంచి విడుదలైన వరద ఉధృతి నుంచి రక్షణగా దిగువన ఆప్రాన్‌ (కాంక్రీట్‌ నిర్మాణం) కొట్టుకుపోయిందని ఎస్డీఎ్‌సఓ పరిశీలనలో తేలింది. కాంక్రీట్‌ కొట్టుకుపోవడంతో బ్యారేజీ దిగువున భారీ గుంతలు ఏర్పడ్డాయని, మిగిలి ఉన్న ఆప్రాన్‌ భాగం సైతం ఎప్పుడైనా కొట్టుకుపోవచ్చన్నట్లు బలహీనంగా ఉందని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఆప్రాన్‌ వరద ధాటికి కొట్టుకుపోగా, తర్వాత కాలంలో మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిపోయింది. మిగిలిన రెండు బ్యారేజీల్లో సీపేజీలు బయటపడ్డాయి. అదే తరహాలో మంజీరా బ్యారేజీ ఆప్రాన్‌ కొట్టుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. బ్యారేజీ సామర్థ్యానికి మించిన వరద ఒత్తిడితోనే పియర్లకు పగుళ్లు వచ్చినట్టు ఎస్డీఎ్‌సఓ పేర్కొంది. ఇది రాతి ఆనకట్ట కావడంతో ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఆనకట్టలకు ఉండే దృఢత్వం ఉండదని అభిప్రాయపడింది. తాగునీటి అవసరాల కోసం మంజీర బ్యారేజీలో ఏడాది పొడవునా నీటిని నిల్వ చేస్తుండడంతో కట్టపై ఒత్తిడి ఉంటోందని పేర్కొంది. పెద్దసంఖ్యలో తుమ్మచెట్లు పెరిగి బ్యారేజీ మట్టికట్టలను బలహీనపరుస్తున్నాయని తేల్చింది. అడవిని తలపించేలా తుమ్మచెట్లు పెరిగిపోవడంతో 1.5 కి.మీల కట్టలను పరిశీలించకపోయినట్టు పేర్కొంది. వాటి వల్ల డ్యామ్‌ రివర్‌బెడ్‌ దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది. గేట్ల సీలింగ్‌ సరిగ్గా లేదని, భారీగా లీకేజీలు కనిపిస్తున్నాయని పేర్కొంది. బ్యారేజీ పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. బ్యారేజీని పటిష్ఠపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) ఆధ్వర్యంలో అధ్యయనం జరిపించాలని సిఫారసు చేసింది.


జలాశయంలో 700 మొసళ్లు!

మంజీరా జలాశయంలో 700 వరకు మొసళ్లు ఉన్నాయని, అవి నీటిని కలుషితం చేస్తున్నాయని ఎస్డీఎ్‌సఓ నివేదిక తెలిపింది. అవి బ్యారేజీ నిర్వహణ పనులకు ఆటకంగా మారాయని, గేట్లను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. వాటి వల్ల కూడా గేట్ల సీళ్లు కూడా పనిచేయడం లేదని పేర్కొంది. మొసళ్లను ప్రాజెక్టు నుంచి తరలించాలని సూచించింది.


ఇవి కూడా చదవండి:

ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..

జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

For More AP News and Telugu News

Updated Date - Jun 27 , 2025 | 04:21 AM