Share News

కేసీఆర్‌ ఫొటో ఉంటే తప్పా?

ABN , Publish Date - Jan 24 , 2025 | 02:59 AM

తన క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్‌ ఫొటో ఉంటే తప్పేంటని బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రె్‌సలో చేరిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్‌ ఫొటో ఉంటే తప్పా?

  • రేవంత్‌ చిత్రం పెట్టడం.. పెట్టకపోవడం నా ఇష్టం

  • ఇంట్లో ఇతర నేతలతో ఫొటోలు ఉండొద్దా?

  • కాట శ్రీనివాస్‌గౌడ్‌ కార్యకర్తలను ఉసిగొల్పాడు

  • పటాన్‌చెరు శాసన సభ్యుడు మహిపాల్‌ రెడ్డి

  • ఎమ్మెల్యే మాకొద్దని కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన

  • క్యాంపు కార్యాలయం ముట్టడి.. హైవేపై ధర్నా

  • కేసీఆర్‌ ఫొటో తొలగించి.. రేవంత్‌ ఫొటో

  • గులాబీ రంగు కుర్చీలు ధ్వంసం

పటాన్‌చెరు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): తన క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్‌ ఫొటో ఉంటే తప్పేంటని బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రె్‌సలో చేరిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్‌ ఫొటో పెట్టడం, పెట్టకపోవడం తన ఇష్టమని అన్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి వైఖరిని నిరసిస్తూ గురువారం కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆయన క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. కొందరు లోపలికి దూసుకెళ్లి కేసీఆర్‌తో ఎమ్మెల్యే దిగిన ఫొటోలను తొలగించి, రేవంత్‌ ఫొటో పెట్టారు. దీనిపై ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్యాంపు కార్యాలయమంటే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఉండే నివాసమని, గతంలో రూ.300కోట్లతో నిర్మించ తలపెట్టిన ఆస్పత్రి శంకుస్థాపన సమయంలో అప్పటి సీఎం కేసీఆర్‌తో దిగిన ఫొటో ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. నాయకులతో దిగిన ఫొటోలు ఇంట్లో పెట్టుకుంటే అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో దిగిన ఫొటో పదేళ్లుగా ఉందని, దానిని కూడా తప్పుపడతారా అని ప్రశ్నించారు.


కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్‌ గౌడ్‌ కార్యకర్తలు, నాయకులను ఉసిగొల్పి తన క్యాంపు కార్యాలయంపై దాడిచేయించారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఛీకొట్టినా ఆయనకు సిగ్గురాలేదని విమర్శించారు. కాగా, మహిపాల్‌ రెడ్డి కాంగ్రె్‌సలో చేరి ఇంకా బీఆర్‌ఎస్‌ పాట పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పటాన్‌చెరులో జాతీయ రహదారిపై ధర్నా చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం ముందు బైఠాయించి.. సీఎం రేవంత్‌ రెడ్డి ఫొటోలను ప్రదర్శిస్తూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారి మధ్య తీవ్ర పెనుగులాట చోటుచేసుకుంది. కొందరు కార్యకర్తలు పోలీసుల వలయాన్ని తప్పించుకుని సీఎం ఫొటోతో పరుగులు తీస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి దూసుకుపోయారు. ఆ సమయంలో అక్కడ ఎమ్మెల్యే లేరు. వరండాలో ఉన్న గులాబీ కుర్చీలను ధ్వంసం చేశారు.


ఎమ్మెల్యే క్యాబిన్‌లోకి దూసుకెళ్లి గతంలో కేసీఆర్‌తో ఎమ్మెల్యే దిగిన ఫొటోలను తొలగించారు. రేవంత్‌ రెడ్డి ఫొటో పెట్టి కాంగ్రెస్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. వారిని పోలీసులు చెదరగొట్టి బయటకు పంపించివేశారు. కాగా, మహిపాల్‌ రెడ్డి వర్గానికి, కాట శ్రీనివా్‌సగౌడ్‌ వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే పార్టీలోకి రావడాన్ని కాట వర్గీయులు తీవ్రంగా వ్యతికిస్తున్నారు. రెండు, మూడు రోజులుగా ఐడీఏ బొల్లారం, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌ మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్న ఎమ్మెల్యే... కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆందోళనకు దిగారు. కాంగ్రె్‌సను భూస్థాపితం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన మహిపాల్‌ రెడ్డిని వెంటనే పార్టీ సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పటాన్‌చెరువులో ఇరు వర్గాల వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక అందించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు టీఆర్‌జీ వినోద్‌ రెడ్డితో కమిటీని నియమించారు.

Updated Date - Jan 24 , 2025 | 02:59 AM