Maheshwar Reddy: కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం: ఏలేటి
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:05 AM
రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో చర్చలకు అవకాశమివ్వని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ సర్కారు బాటలోనే నడుస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో చర్చలకు అవకాశమివ్వని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ సర్కారు బాటలోనే నడుస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం శాసనసభ నిర్వహించడం అసమంజసం అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాలు, వరదలు వల్ల కలిగిన నష్టం, యూరియా సమస్యతోపాటు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, ఆటో డ్రైవర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు 30 రోజులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా రోజుకో సమస్యపై చర్చించేందుకు 30 అంశాలతో జాబితాను అందజేశామని చెప్పారు.
ఇక, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే కాళేశ్వరం అనే జైలును ఏర్పాటు చేసి నిందితులను అందులో వేయాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద వ్యాఖ్యానించారు. వరద బాధితులకు ప్రభుత్వం మొండిచేయి చూపిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు.