Mahesh Kumar Goud: బనకచర్ల పాపం కేసీఆర్, హరీశ్‌దే!
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:49 AM
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రయోజనాలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏపీకి తాకట్టు పెట్టిందని టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు.
బీఆర్‌ఎస్ సర్కారు ఏపీ పాలకులకు తలొగ్గింది.. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది
కేంద్రానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టు ఆపాం
ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే యాత్ర
దేవుడి పేరుతో బీజేపీ చిచ్చు: మహేశ్‌గౌడ్
వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో టీపీసీసీ జనహిత పాదయాత్ర
వికారాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/పరిగి: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రయోజనాలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏపీకి తాకట్టు పెట్టిందని టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. అప్పటి సీఎం కేసీఆర్, సాగునీటి మంత్రి హరీశ్‌రావు ఏపీ పాలకులకు తలొగ్గి చేసిన తప్పిదాలను సరిదిద్దేందుకు.. తెలంగాణ వాటా వెనక్కి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేంద్రానికి ఫిర్యాదు చేసి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకున్నామని తెలిపారు. టీపీసీసీ ఆఽధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర రెండో రోజు శుక్రవారం ఉదయం పరిగి పట్టణంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్ గార్డెన్స్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా సంగుపేట నుంచి జోగిపేట వరకు పాదయాత్ర నిర్వహించారు. జోగిపేటలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడారు.
ప్రజలతో మమేకం అయ్యేందుకే: మహేశ్‌గౌడ్
పాదయాత్ర అనేది కాంగ్రెస్ సంస్కృతిలో ఓ భాగమని, ప్రజలతో మమేకమై కష్టసుఖాలు తెలుసుకునేందుకే టీపీసీసీ పాదయాత్రకు శ్రీకారం చుట్టిందని మహేశ్‌గౌడ్ తెలిపారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. 42శాతం బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల గురించి కేసీఆర్ కూతురు, అల్లుడికి ఏం సంబంధమని మహేశ్‌గౌడ్ ప్రశ్నించారు. అసలు కవిత ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా తెలుసా అని ప్రశ్నించారు. కేసీఆర్ మంచోడని ఏపీ మంత్రి లోకేశ్ కితాబునిస్తున్నారని, బనకచర్ల విషయంలో కేసీఆర్ ఏపీకి లాభం చేయడమే దీనికి కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే త్యాగాల పార్టీ అని.. సోనియా, రాహుల్ ప్రధాని అయ్యే అవకాశమున్నా త్యాగం చేశారని మహేశ్‌గౌడ్ చెప్పారు. ‘‘మోదీ ఏం చదువుకున్నారు? ఏం సర్టిఫికెట్ ఉందో ఎవరికీ తెలియదు. అలాంటి వ్యక్తి కుల, మతాల పేరిట ప్రజల చిచ్చుపెట్టి పాలిస్తున్నారు. దేవుడు దేవుడే.. రాజకీయం రాజకీయమే. కానీ బీజేపీకి ఓట్ల కోసం శ్రీరాముడు కావాల్సి వస్తోంది. బీజేపీని ఏమైనా శ్రీరాముడు స్థాపించాడా? శ్రీరాముడికి బీజేపీకి ఏం సంబంధం? ఇలాంటి రాజకీయాలు చేస్తున్న బీజేపీతో వచ్చే తరాలకు కూడా శాపమే..’’ అని మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. ఇక బీసీలకు సామాజికన్యాయం కల్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పరితపించడం అభినందనీయమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. రాహుల్‌గాంఽధీ ఏ రాష్ట్రానికి వెళ్లినా తెలంగాణ మోడల్ గురించే చెబుతుంటారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి: శ్రీధర్‌బాబు
సంక్షేమ కార్యక్రమాల అమల్లో కార్యకర్తల పాత్ర కీలకమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా కార్యకర్తలు గౌరవంగా నిలబడాలనే హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బలమైన, గెలిచే అవకాశం ఉన్న వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు.
మట్టిని ఎత్తిపోసి.. మొక్కలు నాటి..
శుక్రవారం ఉదయమే ఇక్కడి గిరిజన బాలికల గురుకుల పాఠశాలో మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మట్టిని ఎత్తిపోసి, మైదానాన్ని చదును చేశారు. మొక్కలు నాటారు. కార్యకర్తల సమావేశానికి ముందు మీనాక్షి నటరాజన్ నూలు వడికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత
Read latest Telangana News And Telugu News