Manda Krishna: లక్ష డప్పులు, వేల గొంతుల ప్రదర్శనకు అనుమతి నిరాకరణ అన్యాయం
ABN , Publish Date - Feb 04 , 2025 | 05:13 AM
ఎస్సీ వర్గీకరణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నో సభలు, సమావేశాలు, ఆందోళనలు, చలో హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహించామని, ఎప్పుడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
మా ప్రదర్శనను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చూడొద్దు
ఎప్పుడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదు
మళ్లీ వినతిపత్రం ఇస్తాం.. సీఎం రేవంత్ స్పందించాలి
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
పంజాగుట్ట, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నో సభలు, సమావేశాలు, ఆందోళనలు, చలో హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహించామని, ఎప్పుడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. తమ సంస్కృతిని, డప్పు వాయిద్యాన్ని కాపాడుకోవడానికి ఈ నెల 7న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నుంచి పెద్ద అంబేడ్కర్ విగ్రహం వరకు లక్ష డప్పులు, వేల గొంతుల పేరుతో తలపెట్టిన తమ సంస్కృతీ ప్రదర్శనకు ప్రభుత్వం, పోలీసు శాఖ వివిధ సాకులు చూపుతూ అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో వర్గీకరణకు మద్దతు ఇస్తున్న సంఘాలు, కుల సంఘాల నాయకులతో కలిసి మంద కృష్ణ మాదిగ మాట్లాడారు.
పోలీసులు ఆరు అంశాలను చూపుతూ తమ ప్రదర్శనకు అనుమతి నిరాకరించారని పేర్కొన్న ఆయన.. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, అసాంఘిక శక్తులు వచ్చే ప్రమాదం ఉందనడం అన్యాయమని చెప్పారు. తమ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవద్దని సీఎం ఏమైనా చెప్పారా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ప్రదర్శనను చూడవద్దని, శాంతియుతంగా జరుగుతుందని చెప్పారు. డీజీపీ, సీపీతో సీఎం మాట్లాడాలని కోరారు. ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 9న సచివాలయం వద్ద లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించిందని, తమ ప్రదర్శనకు అనుమతి ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ప్రభుత్వానికో న్యాయం తమకో న్యాయమా అని ప్రశ్నించారు. తమ ప్రదర్శన గిన్నిస్ బుక్‌లో చోటుదక్కేలా ఉంటుందన్నారు.
శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం
ఎమ్మార్పీఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరణపై పోలీసుశాఖ వివరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ నెల 7న తలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభకు అనుమతిస్తే శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. అనుమతి నిరాకరించడానికి కారణాలను శాంతిభద్రతల విభాగం అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ సోమవారం తెలిపారు. ‘ర్యాలీ, సభకు హాజరయ్యేవారి సంఖ్యను ఎమ్మార్పీఎస్ తెలపలేదు. ఎక్కువ మంది వస్తే ట్రాఫిక్ నిర్వహణతో పాటు ఇతర సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయాల్లో సంఘ విద్రోహ శక్తులు సమస్యలు సృష్టించే అవకాశాలు ఉంటాయ’ని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 7న పనిదినం కావడం, ర్యాలీ నిర్వహించాలనుకున్న ప్రాంతం హైసెక్యూరిటీ జోన్‌లో ఉండటంతో సచివాలయానికి వచ్చే వీవీఐపీలు, ఉద్యోగులు, సందర్శకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.