స్థానిక ఎన్నికలు జూలైలో..!?
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:36 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీలకు కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీలకు.. తర్వాత గ్రామ పంచాయతీల్లో’8 ఎన్నికల ఏర్పాట్లపై చర్చిస్తున్న సర్కారు?
బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే యోచన
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీలకు కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. జూలైలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల ఏర్పాట్లపైనా చర్చిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీలకు ఎన్నికలకు నిర్వహించి, ఆ తర్వాత పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఇదే అంశంపై సంబంఽధిత అధికారులతో చర్చిస్తోంది. అధికారులు మాత్రం ముందు సర్పంచ్ ఎన్నికలే నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది. గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఇప్పటికే ఏడాదికి పైగా అయ్యిందని, కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిఽధులు కూడా రూ.1,500 కోట్లకు పైగా నిలిచిపోయాయనే వివరాలను సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. మొదట సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి, ఆయా పాలకవర్గాల వివరాలను కేంద్రానికి నివేదిస్తే.. నిలిచిపోయిన నిధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని వివరించినట్లు తెలిసింది. అయితే మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించినా, తర్వాత కొద్ది రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జూలైలో స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు అడుగులు ముందుకు పడుతున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం పంచాయతీలు, మునిసిపాలిటీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న సంగతి తెలిసిందే.
42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు!
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం చొప్పున రిజర్వేషన్లను అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీల రిజర్వేషన్లను 29 నుంచి 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదించింది. అవి గవర్నర్ ఆమోదం కోసం వెళ్లాయి. పార్లమెంటులో చర్చించి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లోకి ఈ బిల్లులను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నిరవధిక వాయిదా పడ్డాయి. ఉభయసభల్లో తెలంగాణ బీసీ బిల్లులు చర్చకు రాలేదు. మళ్లీ వానాకాలంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. దీంతో ఈ అంశంపై మరికొంత కాలం వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటికీ ఈ ప్రక్రియ మొదలవకపోతే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఎలా ముందుకెళ్లాలనేదానిపై న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని యోచిస్తోంది. అయితే బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లులను అలాగే ఉంచి, ఎన్నికలకు వెళ్లాలనుకుంటే గతంలో అమలైన రిజర్వేషన్లతోనే నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను కేటాయించగా.. మిగిలిన రిజర్వేషన్లను బీసీలకు కేటాయించాలి. గతంలో బీసీలకు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 21-22 శాతం మేర రిజర్వేషన్లు అమలవగా, మునిసిపాలిటీల్లో 31 శాతం చొప్పున అమలయ్యాయి. ఇప్పుడూ అలాగే అమలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42ు రిజర్వేషన్లను అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీనిపైనా పార్టీలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
గవర్నర్ ఆమోదిస్తారా?
గవర్నర్ దగ్గర రెండు బీసీ బిల్లుల ఆమోదం ఆలస్యమయ్యే అవకాశం ఉందా? అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో ఝార్ఖండ్‌లో బీసీల రిజర్వేషన్లు పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో బిల్లులు పెట్టి, వాటిని గవర్నర్‌కు పంపింది. కానీ, ఆర్నెల్ల దాకా గవర్నర్ వాటిని ఆమోదించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సఖ్యత నేపథ్యంలోనే గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతిస్తారనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో తెలంగాణ బిల్లులను కేంద్రం ఎప్పుడు ఆమోదిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News