Srisailam Reservoir: ‘శ్రీశైలం’ భద్రతపై రేవంత్, ఉత్తమ్‌కు నోటీసులు
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:19 AM
శ్రీశైలం రిజర్వాయర్ భద్రతపై నిర్లక్ష్యాన్ని చూపినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్స్ లీగల్ నోటీసులు పంపింది.
జారీ చేసిన ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్స్
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రిజర్వాయర్ భద్రతపై నిర్లక్ష్యాన్ని చూపినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్స్ లీగల్ నోటీసులు పంపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, కృష్ణాబోర్డు చైర్మన్ అతుల్‌జైన్‌లకు కూడా నోటీసులు జారీ చేసింది.
శ్రీశైలం ప్రాజెక్టును 19 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లడానికి అనుగుణంగా డి జైన్ చేశారని, 2009 అక్టోబరు 2న 25.5 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో ప్రాజెక్టు కట్ట తీవ్రంగా దెబ్బతిందని ఫెడరేషన్ పేర్కొంది. 900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ కేంద్రంతో పాటు 2000 చదరపు కిలోమీటర్ల దాకా సాగునీటిని అందించే ప్రధాన ప్రాజెక్టు దెబ్బతిన్నా పనులు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని నోటీసులో పేర్కొంది. దాంతో శ్రీశైలం రిజర్వాయర్ రక్షణకు తీసుకునే చర్యలేంటో వివరించాలని కోరింది.