Share News

Land Dispute: కమ్మగూడ భూవివాదంలో ఘర్షణ

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:05 AM

తుర్కయాంజల్‌ మునిసిపాలిటీ కమ్మగూడ-శివాజీనగర్‌ ఫేస్‌-2లోని 240, 241, 242 సర్వేనంబర్ల పరిధిలో భూమి విషయమై రెండు పక్షాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది.

Land Dispute: కమ్మగూడ భూవివాదంలో ఘర్షణ

  • పరస్పరం రాళ్ల దాడి.. ద్విచక్ర వాహనం దగ్ధం

  • ఉద్రిక్త పరిస్థితులతో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు

వనస్థలిపురం/హయత్‌నగర్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): తుర్కయాంజల్‌ మునిసిపాలిటీ కమ్మగూడ-శివాజీనగర్‌ ఫేస్‌-2లోని 240, 241, 242 సర్వేనంబర్ల పరిధిలో భూమి విషయమై రెండు పక్షాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఇరుపక్షాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఓ ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేయగా, జేసీ అద్దాలు పగుల గొట్టిన ఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం ఉదయం జరిగింది. ఈ మూడు సర్వే నంబర్ల పరిధిలోని 10.09 ఎకరాల భూమిని ఉప్పల్‌ వాసి గుండ్ల రాజమ్మకు ఆమె పూర్వీకుల నుంచి సంక్రమించిందని కోర్టు తీర్పు ఇచ్చినట్లు సమాచారం. అప్పటికే ఈ భూమిలో వేసిన ప్లాట్లను వందల మంది కొనుగోలు చేశారు. వారిలో కొందరు ఇళ్లు కట్టుకుంటే.. మరికొందరు ప్లాట్ల చుట్టూ ప్రహరీగోడ ఏర్పాటు చేసుకున్నారు.


రూ.కోట్ల విలువైన ఈ భూమిపై కోర్టు తీర్పు ఆధారంగా దాన్ని దక్కించుకునేందుకు రాజమ్మ 2024లో ఒక వ్యక్తికి జీపీఏ చేశారు. జీపీఏ తీసుకున్న ఆ వ్యక్తి.. బుధవారం తెల్లవారుజామున కూలీలతో ఆ ప్లాట్లలోని ప్రహరీలను, కడీలు, ప్రీకాస్ట్‌ వాళ్లను కూల్చేందుకు యత్నించారు. కాలనీ వాసులు, పాట్ల యజమానులు ఎదురు తిరిగారు. వనస్థలిపురం పోలీసులు ఇరుపక్షాలను చెదరగొట్టారు. ఆ ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశామని ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. కాగా, ఇరువర్గాలు తొర్రూర్‌లోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడా ఇరుపక్షాల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది.

Updated Date - Apr 10 , 2025 | 05:05 AM