ఫార్ములా-ఈ కేసులో.. నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్!
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:15 AM
ఫార్ములా-ఈ కారు రే సు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోమవారం మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించనుంది.

రేపు విచారణకు రావాల్సిందిగా ఈడీ సమన్లు
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రే సు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోమవారం మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించనుంది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. న్యాయ నిపుణుల సూచన మేరకు ఈ కేసులో విచారణకు హాజరవుతానని కేటీఆర్ కూడా శనివారం బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో తెలిపారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్ర యించారు.
ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని పేర్కొంది. అయితే విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులిచ్చింది. దీంతో సోమవారం జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. కాగా, ఈ కేసులో సహనిందితులుగా ఉన్న బీఎల్‌ఎన్ రెడ్డి, అరవిందకుమార్‌లనూ ఈ నెల 2, 3వ తేదిల్లోనే విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేయగా.. వారిద్దరు కొంత సమయం కావాలని రాతపూర్వకంగా కోరారు. దీంతో వారికి ఈడీ అధికారులు వారం రోజుల వ్యవధి ఇచ్చారు.