KTR: ఏసీబీకి జవాబులు చెప్పలేక కేటీఆర్ ఆపసోపాలు
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:16 AM
ఏసీబీ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లోపల ఆపసోపాలు పడిన కేటీఆర్.. బయటికొచ్చి పులకేశిలా బిల్డప్ ఇస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు.
లొట్టపీసు కేసంటూనే వణికిపోతున్నారు: ఆది శ్రీనివాస్
భయంతోనే కేటీఆర్ పిచ్చి ప్రేలాపనలు: అద్దంకి దయాకర్
విచారణకు ఎన్ని సార్లు పిలిచినా వెళ్లాల్సిందే: బల్మూరి వెంకట్
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ఏసీబీ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లోపల ఆపసోపాలు పడిన కేటీఆర్.. బయటికొచ్చి పులకేశిలా బిల్డప్ ఇస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. లొట్టపీసు కేసు అంటూనే లోపల వణికిపోతున్నారని పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి విచారణకు హాజరై.. అరెస్ట్ కాకుండా వచ్చాడని బీఆర్‌ఎస్ కార్యకర్తలు బాణా సంచా కాల్చి, సంబరాలు చేసినట్లున్నారని ఎద్దేవా చేశారు. ఆ రేసు ద్వారా తెలంగాణ ప్రతిష్టను పెంచానని గప్పాలు కొట్టుకునేందుకు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. అరెస్టు భయంతో కేటీఆర్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. ఆయన పరిస్థితి చూస్తుంటే సిగ్గు పోయేదాకా సిగం ఊగినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతూ తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు.
ఉద్యమంలో కేటీఆర్ జైలుకు వెళ్లాడో.. లేదో తెలియదు కానీ.. ఇలాగే పిచ్చి ప్రేలాపనలు చేస్తే తగిన బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. చట్టం మీద గౌరవం ఉందంటూనే కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, సత్యహరిశ్చంద్రుడిలాబిల్డప్ ఇస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. అవసరమైతే మూడు సార్లు కాదు.. 300 సార్లైనా అధికారులు విచారణకు పిలిచినప్పుడు వెళ్లాల్సిందేనని అన్నారు. కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే విచారణలో నిజాయితీగా సమాధానాలు చెప్పాలన్నారు. అనవసరంగా కేసులు బనాయించాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మంత్రి వర్గం అనుమతి లేకుండా ఇష్టానుసారంగా విదేశీ కంపెనీకి 55 కోట్లు దోచిపెట్టిన కేటీఆర్.. ఇప్పుడు నంగనాచి కబుర్లు చెపుతున్నారని విమర్శించారు. కేవలం విచారణకు పిలిేస్తనే ఎందుకింత హడావుడి అని ప్రశ్నించారు.