Share News

KTR: కంచ గచ్చిబౌలి భూ కుంభకోణాన్ని 48 గంటల్లో బయటపెడతా

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:47 AM

కంచ గచ్చిబౌలి భూ కుంభకోణంలో చీకటి కోణాలు చాలా ఉన్నాయి. 400 ఎకరాలు, దాని వెనక వేల కోట్ల బాగోతాన్ని 48 గంటల్లో బయటపెడతా. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ నేతలే కాకుండా ఒక బీజేపీ ఎంపీకూడా ఉన్నారు.

KTR: కంచ గచ్చిబౌలి భూ కుంభకోణాన్ని  48 గంటల్లో బయటపెడతా

  • ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ నేతలతో పాటు బీజేపీ ఎంపీ

  • బీజేపీ, కాంగ్రెస్‌ ఉమ్మడి సీఎం రేవంత్‌

  • ఢిల్లీ చెప్పుచేతల్లో ఆ జాతీయ పార్టీలు

  • ఏఐ అంటే ఎనుముల ఇంటెలిజెన్స్‌

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘కంచ గచ్చిబౌలి భూ కుంభకోణంలో చీకటి కోణాలు చాలా ఉన్నాయి. 400 ఎకరాలు, దాని వెనక వేల కోట్ల బాగోతాన్ని 48 గంటల్లో బయటపెడతా. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ నేతలే కాకుండా ఒక బీజేపీ ఎంపీకూడా ఉన్నారు. నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని రేవంత్‌ రెడ్డి కుట్ర చేస్తున్నారు. ఈ భూముల వ్యవహారంలో కాంగ్రెస్‌ అవినీతి కోణంపై ప్రజలకు అన్ని విషయాలు వెల్లడిస్తాన’ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ జరిపారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ లోపాయికారి వ్యవహారం నడుస్తోందని ఆరోపించారు. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా ఆ రెండు పార్టీల ఉమ్మడి సీఎంగా రేవంత్‌ రెడ్డి పనిచేస్తున్నారు. అందుకే ఎప్పుడు ఆయనకు సమస్య వచ్చినా కాపాడేందుకు బీజేపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ రక్షణ కవచంలా నిలుస్తున్నార’ని ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వం అనుకుంటే కంచగచ్చిబౌలి భూముల అమ్మకం ఆపలేదా? అని ప్రశ్నిస్తూ బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘బీజేపీ, కాంగ్రెస్‌.. ఈ రెండు జాతీయ పార్టీలూ ఢిల్లీ చెప్పుచేతల్లోనే పనిచేస్తాయి. ఒకరు చెప్పులు మోస్తే.. మరొకరు బ్యాగులు మోస్తున్నారు. ఏం చేయాలన్నా.. ఢిల్లీ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి.’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు బీఆర్‌ఎస్‌ పార్టీ మొదలుపెట్టినవి కాదని, లగచర్ల, మూసీ ప్రక్షాళన, హెచ్‌సీయూ విషయంలో బాధితులే తమ వద్దకు వచ్చారని కేటీఆర్‌ చెప్పారు. కంచ గచ్చిబౌలిలో విధ్వంసంపై బహిర్గతం కావడతో ఏఐ వీడియోలని ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారన్నారు. అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూ పార్క్‌ నివేదికే పేర్కొందని ప్రస్తావించారు. ‘ఏఐ వీడియోల పేరుతో తప్పించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏఐ అంటే ఎనుముల ఇంటెలిజెన్స్‌ మేం అనుకోవచ్చు కదా? అని అన్నారు.


రేవంత్‌ అసమర్థత వల్లే మీనాక్షి సమీక్షలు..

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 17 నెలలైనా మంత్రివర్గాన్ని విస్తరించుకునే పరిస్థితి లేకుండాపోయిందని కేటీఆర్‌ విమర్శించారు. ‘రేవంత్‌ రెడ్డి ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా ఒక్క రూపాయి కూడా రాలేదు. సీఎంగా ఆయన విఫలమైనందుకే కాంగ్రెస్‌ హైకమాండ్‌ జోక్యం చేసుకొంటోంది. ఆయన అసమర్థత వల్లే రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ సచివాలయంలో సమీక్షలు చేస్తున్నార’ని కేటీఆర్‌ అన్నారు. ‘‘ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక గోదావరి, కృష్ణా జలాల్లో విచ్చలవిడిగా జల దోపిడీకి పాల్పడ్డారు. మేడిగడ్డ ఎప్పుడు కొట్టుకుపోతుందా అని కాంగ్రెస్‌ గుంటనక్కలా ఎదురుచూస్తోంది. భూకంపం, భారీ వరద వచ్చినా మేడిగడ్డ చెక్కు చెదరలేదన్న విషయాన్ని గుర్తించాలి’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.


చరిత్రలో నిలిచేలా వరంగల్‌ సభ

బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలను వరంగల్‌ సభతో ఆపకుండా ఏడాది పాటు వివిధ కార్యక్రమాలు చేపడతామని కేటీఆర్‌ తెలిపారు. చరిత్రలో నిలిచేలా ఈ సభను నిర్వహిస్తామన్నారు. సభకు అనుమతించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. డిజిటల్‌ విధానంలో పార్టీ సభ్యత్వాల నమోదు చేపడతామన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలతో పాటు అక్టోబరులో పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాల ప్రభావం దేశంపైనేకాక రాష్ట్రంలోని ఫార్మా, ఐటీ ఎగుమతులపై పడనుందని అన్నారు. ఆమెరికా దుందుడుకు చర్యలపై ప్రధాని మోదీ, కేంద్ర విదేశాంగ మంత్రులు స్పందించడం లేదని విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..

సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 09 , 2025 | 04:47 AM