Share News

KTR: కోడిని వేలాడదీసి పచ్చడి మెతుకులు పెడతున్నారు: కేటీఆర్

ABN , Publish Date - Nov 01 , 2025 | 03:30 PM

కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ వాళ్లు గ్యారెంటీ కార్డులు ఇచ్చి అరచేతిలో స్వర్గం చూపించారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్‌ లక్ష రూపాయలు ఇస్తే.. తులం బంగారం కూడా ఇస్తానని చెప్పి రేవంత్‌ రెడ్డి మాట తప్పారని విమర్శించారు.

KTR: కోడిని వేలాడదీసి పచ్చడి మెతుకులు పెడతున్నారు: కేటీఆర్
KTR

హైదరాబాద్, నవంబర్ 1: అహానా పెళ్లంట సినిమా తరహాలో రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని.. కోడిని వేలాడదీసి పచ్చడి మెతుకులు పెడతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టీడీపీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ నాయుడు.. ఆయన సతీమణి, టీడీపీ నాయకురాలు సుజాతతో పాటు పలువురు నేతలు శనివారం నాడు గులాబీ పార్టీలో చేరారు. పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన ఆ నేతలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు కేటీఆర్. వేసిన నామినేషన్‌ విత్‌డ్రా చేసుకొని మరీ బీఆర్ఎస్‌కు సపోర్ట్‌ చేస్తున్న ప్రవీణ్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు. శ్రీనివాస్‌ నాయుడు చాలా కాలం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని.. ఐదేళ్ల కిందటే రావాల్సిన నాయకుడు ఇప్పుడు వచ్చారని అన్నారు.


మన పార్టీ నుంచి గెలిచి మేయర్‌ అయిన వ్యక్తి ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డే ఏ పనులు చేయట్లేదని.. ఇక మేయర్‌ మనకు ఏం పనులు చేస్తుందని దుయ్యబట్టారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని గ్యారెంటీ కార్డులు ఇచ్చి అరచేతిలో స్వర్గం చూపించారని ఫైర్ అయ్యారు. ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్‌ లక్ష రూపాయలు ఇస్తే.. తులం బంగారం కూడా ఇస్తానని చెప్పి రేవంత్‌ రెడ్డి మాట తప్పారని అన్నారు. ఇప్పుడు తులం బంగారం ఇవ్వకపోగా.. మెడలో గొలుసు కూడా లాక్కెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఫ్రీ బస్‌ ఇస్తున్నామని చెప్పి భార్యకి ఫ్రీ ఇచ్చి.. భర్త నుంచి డబుల్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను కేసీఆర్‌ అమలు చేశారని.. అలాగే కేసీఆర్‌ కిట్‌ ఇచ్చారని కొనియాడారు. తమ హయాంలో ఆడపిల్ల పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్‌ హయాంలో జరిగాయని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, రంజాన్‌ తోఫా, బతుకమ్మ చీరలు.. ఇలా అన్ని పథకాలు బంద్‌ అయ్యాయని ఆగ్రహించారు.


ఎన్నికలు వస్తే ఎవరైనా ఏం చేస్తారో చెప్తారు.. కానీ బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డికి పదవి ఇచ్చిందే ప్రజలు అని.. అది మర్చిపోయి రాజులా ఫీలవుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌ తోక కత్తరించేందుకు రెడీగా ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారని అన్నారు. అసలు కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రియల్‌ ఎస్టేట్‌ నాశనం చేశారని.. రెండేళ్లలో ఏం మంచిపని చేశారో చెప్పాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇళ్లు కూలగొడుతున్నారని ఫైర్ అయ్యారు. హైడ్రా, బుల్డోజర్‌ పేరుతో పేదలపై జులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇచ్చిన ఏ ఒక్క హామీనీ ఈ ప్రభుత్వం అమలు చేయలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. బీసీ, ఎస్సీ డిక్లరేషన్‌ అంటూ నోటికొచ్చిన 420 హామీలు ఇచ్చారని మండిపడ్డారు. మాగంటి గోపినాథ్‌ అనారోగ్యంతో చనిపోతే ఈ నెల 11న బైపోల్ ఎన్నిక వచ్చిందన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు కేసీఆర్‌ టికెట్‌ ఇచ్చారని చెప్పారు. భర్త చనిపోయి మాగంటి సునీత ఏడిస్తే.. దాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు డ్రామా అంటున్నారని చెప్పారు. ఒక ఆడబిడ్డ ఏడిస్తే కూడా ఇంత అన్యాయంగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డను అవమానిస్తున్న వారికి బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. అధికారంలోకి రాగానే మేయర్‌, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరినా ప్రజలు తమతోనే ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్‌ విజయంతోనే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ప్రారంభం కావాలని.. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో మాగంటి సునీత ఘన విజయం సాధించబోతున్నారని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

Kishan Reddy On Congress: భారత ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి

Miyapur Demolition: మియాపూర్‌లో ఐదంతస్తుల అపార్ట్‌మెంట్ కూల్చేసిన హైడ్రా

Updated Date - Nov 01 , 2025 | 04:11 PM