KTR: పంచాయతీలకు ఎన్నికల్లేవు.. అభివృద్ధికి నిధుల్లేవు!
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:45 AM
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా స్థానిక సంస్థలకు ఎన్నికల్లేవు.. అభివృద్ధికోసం నిధుల్లేవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
ఢిల్లీ పార్టీల మోసాలను ప్రజలు గమనిస్తున్నారు: కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా స్థానిక సంస్థలకు ఎన్నికల్లేవు.. అభివృద్ధికోసం నిధుల్లేవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్‌ఎస్ పాలనలో ‘పల్లె ప్రగతి’ని గురువారం ఎక్స్ వేదికగా ఆయన గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ పార్టీలను నమ్మిన పాపానికి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు.
స్థానికంగా పాలకవర్గం లేకపోవడంతో కేంద్రం ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావడం లేదన్నారు. దీంతో గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. చివరికి పంచాయతీ సిబ్బందికి వేతనాలు, ఉపాధిహామీ కూలీలకు పనిదినాలు లేకపోవడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీకి, పచ్చని పల్లెలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రె్‌సకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కేటీఆర్ హెచ్చరించారు.