Share News

KTR: సర్కారు వైఫల్యం వల్లే యూరియా కొరత

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:26 AM

వినాయక చవితి పండుగ రోజు కూడా రైతులు వర్షంలో తడుస్తూ ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సి రావడం దురదృష్టకరమని, ఇలాంటి దుస్థితి ఎందుకు దాపురించిందో కాంగ్రెస్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

KTR: సర్కారు వైఫల్యం వల్లే యూరియా కొరత

  • పండుగ రోజూ రైతుల పడిగాపులు

  • పదేళ్ల కేసీఆర్‌ పాలనలో ఇలాంటి పరిస్థితే రాలేదు

  • అసెంబ్లీని 15 రోజులు నిర్వహించాలి

  • కాళేశ్వరం ప్రాజెక్టుపై జవాబిస్తాం

  • అది పీసీ ఘోష్‌ కమిషన్‌ కాదు.. పీసీసీ కమిషన్‌: కేటీఆర్‌

  • వ్యవసాయ కమిషనరేట్‌, గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ధర్నాలు

  • కేటీఆర్‌, హరీశ్‌ సహా ఎమ్మెల్యేల అరెస్టు

హైదరాబాద్‌/బర్కత్‌పుర, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి పండుగ రోజు కూడా రైతులు వర్షంలో తడుస్తూ ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సి రావడం దురదృష్టకరమని, ఇలాంటి దుస్థితి ఎందుకు దాపురించిందో కాంగ్రెస్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్క రోజూ ఎరువుల కొరత రాలేదని, రైతులు లైన్లలో నిల్చున్న సందర్భమే లేదని తెలిపారు. కాంగ్రెస్‌ సర్కారు వైఫల్యం వల్లే యూరియా కోసం చెప్పులు, ఆధార్‌ కార్డులను లైన్లలో పెట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమైన నేపథ్యంలో కేటీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్‌ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని ఖాళీ యూరియా బస్తాలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు చేరుకుని.. కమిషనర్‌ గోపీకి వినతిపత్రం ఇచ్చారు. రైతులకు ఎరువులు సరఫరా చేసే వరకూ కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. ఆ తర్వాత సచివాలయం వద్ద మరో సారి ఆందోళనకు దిగారు.


ఆయా నిరసన కార్యక్రమాల్లో కేటీఆర్‌ మాట్లాడుతూ యూరియా సంక్షోభం, రైతుల కష్టాలపై చర్చించకుండా తమకు అనుకూలమైన ఒకటీ రెండు అంశాలపైనే మాట్లాడి సభను ముగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిసున్నారని ఆరోపించారు. ప్రజల కష్టాలపై చర్చించడానికి కనీసం 15 రోజులైనా అసెంబ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం వేసింది పీసీ ఘోష్‌ కమిషన్‌ కాదని, అది కాంగ్రెస్‌ పార్టీ వేసుకున్న పీసీసీ ఘోష్‌ కమిషన్‌ అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పష్టమైన సమాధానం చెబుతామన్నారు. యూరియా అడిగినందుకు రైతు చెంప చెళ్లుమనిపించడమేనా ప్రజా పాలన? ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. దమ్ముంటే యూరియా కొరత, వరద బీభత్సంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్‌ విసిరారు. నిరసన తెలుపుతున్న కేటీఆర్‌, హరీశ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకొని, బీఆర్‌ఎస్‌ భవన్‌కు తరలించారు.

Updated Date - Aug 31 , 2025 | 04:26 AM