KTR : కాళేశ్వరాన్ని విఫల ప్రయోగంగా చిత్రీకరించే యత్నం
ABN , Publish Date - May 22 , 2025 | 07:16 AM
కేటీఆర్ అన్నారు, కాళేశ్వరాన్ని విఫల ప్రయోగంగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులు దూది మూటలాగా తేలిపోతాయంటూ ఆయన వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులు దూది మూటలు: కేటీఆర్
నల్లగొండ, మే 21 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ‘‘కాళేశ్వరాన్ని విఫల ప్రయోగంగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఆ రెండు పార్టీలు కలిసి వండుతున్న వంటకమే ఇది. మాజీ సీఎం కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులు దూది మూటల్లాంటివి. ఎన్ని నోటీసులిచ్చినా, ఎన్ని డ్రామాలాడినా అవన్నీ దూదిపింజల్లా తేలిపోతాయి. ఈ దేశంలో చట్టాలపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా న్యాయం, ధర్మం గెలుస్తాయని, తెలంగాణకు మేలు చేసిన వారిని దేవుడు కాపాడతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతికానితనం, కమీషన్ల కక్కుర్తి వల్లే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలిపోయిందని మండిపడ్డారు. మూడు నెలలైనా అందులోంచి మృతదేహాలు తీసే దమ్ము ప్రభుత్వానికి లేకపోయిందని, పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయిందని, ఆ ఘటనపై ఎలాంటి విచారణ చేపట్టలేదని, కమిషన్ వేయలేదని, నిర్మాణ సంస్థ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. వట్టెం పంపుహౌస్ మునిగిందని, పెద్దవాగు ప్రాజెక్టు రెండు సార్లు కొట్టుకుపోయిందని, వాటిపైనా ఎలాంటి చర్యలు లేవని ధ్వజమెత్తారు. కాళేశ్వరాన్ని మాత్రం విఫల ప్రయోగంగా చూపించే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.