కార్మికుల ఐక్యత కోసం కలిసి నడుద్దాం: కేటీఆర్
ABN , Publish Date - May 02 , 2025 | 05:27 AM
కేటీఆర్ మేడే సందర్బంగా కార్మికుల ఐక్యత కోసం కలిసి నడవాలని పిలుపునిచ్చారు. భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ, సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని కవిత పేర్కొన్నారు.
సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం: కవిత
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి) : కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తోందని, మేడే స్ఫూర్తితో కార్మికుల ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలో అడుగడుగునా కార్మికులకు అండగా నిలిచామని గుర్తు చేశారు. సింగరేణి శ్రామికులకు బోన్‌సలు, ఉద్యోగభద్రత, మెరుగైన సౌకర్యాలతో గౌరవించామని, టీజీఆర్టీసీ కార్మికులకు జీతభత్యాల పెంపు, ఆరోగ్యబీమా వంటి సంక్షేమ పథకాలతో భరోసా కల్పించినట్లు తెలిపారు. మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత కల్పించి సాధికారతను పెంచామని గుర్తు చేశారు. కాగా, భౌగోళికంగా తెలంగాణ తెచ్చుకున్నా... సకలజనులు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే.. సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మేడే సందర్భంగా తన నివాసంలో సింగరేణి, జీహెచ్‌ఎంసీ, భవన నిర్మాణ, హమాలీ, ఆటో కార్మికులతో కలిసి ఆమె సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మేడే స్పూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగిపోవటానికి కృషి చేయాలని, సమసమాజ నిర్మాణం దిశగా మరొక తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిద్దామని ఆమె పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణ భవన్‌లో మేడే ను పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. కాగా, భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు అనే అంశంపై జూన్ 20, 21తేదీల్లో ఇంగ్లాండ్‌లో నిర్వహించే ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సుకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆక్స్‌ఫర్డ్ ఇండియాఫోరం వ్యవస్థాపకుడు సిద్థార్థ్ ేసఠీ గురువారం ఆయనకు లేఖ రాశారు.
For Telangana News And Telugu News