KTR: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి!
ABN , Publish Date - Jul 22 , 2025 | 03:47 AM
స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, నియోజకవర్గ స్థాయిలో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
రేవంత్ సర్కార్ మోసాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లండి
బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, నియోజకవర్గ స్థాయిలో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సీనియర్ నేతలు పాల్గొనాలని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తోన్న మోసాలతో పాటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలను గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో పాటు రైతుబంధు ఇవ్వకుండా అన్నదాతలకు చేస్తోన్న ద్రోహాన్ని కూడా ప్రజలకు వివరించాలన్నారు.
రేవంత్ పాలనలో గ్రామాల్లో అస్తవ్యస్తంగా మారిన పారిశుధ్యం గురించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలులో చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ వైఖరి గురించి ప్రజలకు విడమిర్చి చెప్పాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ చేస్తున్న పోరాటాలు, నిరసన కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేేసలా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న ‘‘గీఫ్ట్ ఎ స్మైల్’’ కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సుస్మిత అనే పేద విద్యార్థినికి ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డా.చంద్రశేఖర్, డా.ప్రణయవాణి దంపతులు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు కేటీఆర్ వారిని అభినందించారు.
యాక్టివాలో నాగుపాము
స్కూటీపై నుంచి దూకేసిన రైడర్
అంబర్‌పేట, జూలై 21 (ఆంధ్రజ్యోతి): స్కూటీపై వెళ్తున్న ఓ రైడర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. అంబర్‌పేటలోని పటేల్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సోమవారం ఉదయం యాక్టివా స్యూటీపై ఆజాద్‌నగర్ మీదుగా అలీకేఫ్ చౌరస్తా వైపునకు వెళ్తున్నాడు. ఆజాద్‌నగర్ మదర్సా వద్దకు రాగానే అప్పటికే స్కూటీలో ఉన్న నాగుపాము ఆకస్మాత్తుగా అతడి చేతిపైకి ఎక్కింది. భయంతో వెంటనే స్కూటీని వదిలేసి కిందకు దూకేశాడు. అయితే, కిందపడిన పాము మళ్లీ యాక్టివాలోకి దూరింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి, స్కూటీ భాగాలను విప్పి ఆ పామును సురక్షితంగా బయటకు తీశాడు. అదృష్టవశాత్తు, పాము కాటు వేయకపోవడంతో సదరు వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News