Share News

KTR: హైదరాబాద్‌ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:57 AM

హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరించాలని బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. కేటీఆర్‌ మాట్లాడుతూ, కౌన్సిలర్లకు విప్‌ జారీ చేసి, ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

KTR: హైదరాబాద్‌ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం

  • బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకు విప్‌ జారీ చేస్తాం

  • ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగబోయే హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. దీనిపై తమ పార్టీ కౌన్సిలర్లకు విప్‌ జారీ చేస్తామని.. ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలు, కార్యకర్తలతో జరిగిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. హైదరాబాద్‌వ్యాప్తంగా కాలనీలు, బస్తీల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసి ఈ నెల 27న జరిగే ఆవిర్భావ సభకు దండులా కదిలి రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ సభ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పిచ్చి పనులతో కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో అసహ్యం పెరుగుతోందని.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తుఫానులా ఎగిరేది గులాబీ జెండానేని చెప్పారు. కాంగ్రె్‌సకు హైదరాబాద్‌లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదని, ఇక్కడి ప్రజల ముందు కాంగ్రెస్‌, బీజేపీల మాయమాటలు పనిచేయలేదని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల కంటే బీఆర్‌ఎస్‌ బలంగా ఉందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని పేర్కొన్నారు.


కేంద్ర మంత్రులతో నయాపైసా లాభం లేదు

కేంద్రంలో ఒకరు సహాయమంత్రిగా, ఇంకొకరు నిస్సహాయ మంత్రిగా బీజేపీ ఎంపీలున్నారని.. వారితో తెలంగాణకు నయా పైసా లాభం లేదని కేటీఆర్‌ విమర్శించారు. హెచ్‌సీయూ భూములను కబ్జా పెట్టాలనుకున్న రేవంత్‌ ప్రయత్నాలను అక్కడి విద్యార్థులు వీరోచితంగా ఎదుర్కొన్నారని చెప్పారు. ఆ భూముల తనఖా విషయంలో భారీ ఆర్థిక మోసం జరిగిందని, దాని వెనుక బీజేపీ ఎంపీ ఉన్నారని ఆరోపించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌లపై ఈడీ చార్జిషీట్‌ వేసినా.. సీఎం రేవంత్‌ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదేమని ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు..


Read Latest
Telangana News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 04:57 AM