KTR: గోదావరి జలాలను దూరం చేసే కుట్ర
ABN , Publish Date - Jul 27 , 2025 | 05:17 AM
గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరం చేసే కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
చంద్రబాబుకు అతి పెద్ద కోవర్టు రేవంత్
మా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు
పోలీసులకు మెదడుందా? గడ్డి తింటున్నరా?
బీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర సదస్సులో కేటీఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్ సిటీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరం చేసే కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 1486 టీఎంసీల నికర జలాల్లో 968 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చాక, ఏపీలో ఏ ప్రాజెక్టు కట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. ఈ మేరకు గోదావరి జలాల విషయంలో కేంద్రం అవార్డు పాస్ చేయాలని డిమాండ్ చేశారు. ‘‘మన మెడ మీద కత్తి పెట్టి.. నెల రోజుల గడువు పెట్టి తెలంగాణ జల హక్కులకు పిండం పెట్టే కుట్రను రేవంత్, చంద్రబాబు కలిసి అమలు చేస్తుంటే మౌనంగా ఉందామా? కేంద్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నా ఊరుకుందామా?’’ అని ప్రశ్నించారు. ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్‌లో శనివారం నిర్వహించిన బీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎ్‌సపై ముప్పేట దాడి జరుగుతోందని, కేసీఆర్, గులాబీ జెండాను గెలవనీయవద్దనే కుట్రపూరిత ఎజెండా అమలవుతోందని తెలిపారు. తెలంగాణలో పనులన్నీ చంద్రబాబు కోవర్టులు చేస్తున్నారని కాంగ్రె్‌సకు చెందిన ఓ ఎమ్మెల్యేనే చెప్పారని తెలిపారు.
చంద్రబాబుకు అతిపెద్ద కోవర్టు రేవంత్‌రెడ్డేనని ఆరోపించారు. తన శిష్యుడు ఏం చెప్పినా వింటాడని చంద్రబాబు అనుకుంటున్నారని, కానీ.. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు కేసీఆర్ ఉన్నారన్న సంగతిని మర్చిపోతున్నారని అన్నారు. ఏ అనుమతి లేకుండా బనకచర్ల కడతాం.. కమీషన్లు పంచుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అక్రమ కేసుల విషయంలో కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘‘కొందరు పోలీసోళ్లు చేయాల్సిన పని చేస్తలేరు. బీఆర్‌ఎస్ పిల్లలు ఏ పోస్టు పెడ్తున్నరు. వాళ్లపై ఏ కేసులు పెట్టాలని చూస్తున్నరు. గెల్లు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆయన భార్య స్వప్న ఫోన్ అడిగారు. అదేంటని అడిగినందుకు ఆమెపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఓ పోస్టు రీ ట్వీట్ చేసినందుకు యువకుడిని జైలులో పెట్టారు. మెడకాయ మీద తలకాయ ఉండే పని చేస్తున్నరా? పోలీసులకు మెదడు ఉందా? అన్నం తింటున్నరా? గడ్డి తింటున్నరా?’’అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.