Kaleshwaram Project Conspiracy: కాళేశ్వరం ప్రాజెక్టును మూసేసే కుట్ర
ABN , Publish Date - Sep 02 , 2025 | 03:53 AM
కాళేశ్వరం విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసేందుకు చంద్రబాబు, మోదీలతో కలిసి రేవంత్ రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారని బీఆర్‌ఎస్...
గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే పన్నాగం
మోదీ, చంద్రబాబుతో కలిసి రేవంత్ కుతంత్రాలు: కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసేందుకు చంద్రబాబు, మోదీలతో కలిసి రేవంత్ రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీబీఐ విచారణ పేరుతో కేవలం కేసీఆర్, బీఆర్‌ఎస్ మీదనే దాడి జరగడం లేదని.. కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే కుతంత్రాలకు ఆ ముగ్గురు తెరతీశారని ధ్వజమెత్తారు. తెలంగాణ గొంతుకగా ఉన్న కేసీఆర్, బీఆర్‌ఎ్‌సలను లేకుండా చేసి రాష్ట్రంలో తిరిగి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మోదీ, చంద్రబాబు ఎజెండా మేరకు బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీలను మోదీ జేబు సంస్థలుగా విమర్శించిన రేవంత్.. 48గంటల్లోనే ఎందుకు మాటమార్చారో చెప్పాలని డిమాండ్‌చేశారు. ఓ వైపు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. రేవంత్ మాత్రం మోదీ ప్రాపకం కోసం వాటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ మీద ఈగ వాలకుండా ప్రధాని మోదీ కాపాడుతున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీకి చేదుగా అనిపించిన సీబీఐ..రేవంత్‌కు ముద్దొస్తుందా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కోరగానే.. అంగీకరించడం ఆ రెండు పార్టీల అక్రమ సంబంధానికి సాక్ష్యమని అన్నారు. కేసీఆర్ మీద విష ప్రచారం చేయాలన్న దుర్మార్గ, రాక్షసఆలోచనతో రేవంత్ ఉన్నారని విరుచుకుపడ్డారు. సీబీఐకేకాదు, ఏ ఏజెన్సీకి కాళేశ్వరం విచారణ అప్పజెప్పినా బీఆర్‌ఎస్ భయపడదన్నారు. ‘‘రాహుల్ గాంధీ.. సీబీఐ అంటే బీజేపీ ‘ప్రతిపక్షాల నిర్మూలన సెల్’అని అన్నారు కదా?మరి మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా?’’ అని కేటీఆర్ ఎక్స్‌లో ప్రశ్నించారు.
హరీశ్ ‘మాస్టర్ క్లాస్’..
అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్‌పై ఆదివారం జరిగిన చర్చలో తమ నేత హరీశ్ రావు అద్భుతంగా బదులిచ్చారని కేటీఆర్ ప్రశంసించారు. కేసీఆర్ శిష్యుడిగా హరీశ్ చేసిన ప్రసంగంతో.. నీటి పారుదల శాఖ గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అయిష్టంగానైనా ఎంతో కొంత నేర్చుకుని ఉంటారని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇది తమ డైనమిక్ లీడర్ హరీశ్‌రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అని కొనియాడారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News