Share News

Kishan Reddy: ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య

ABN , Publish Date - Apr 24 , 2025 | 05:48 AM

కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిరికిపంద చర్యగా మండిపడ్డారు. పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాల ఎదుట దోషిగా నిలబెడతామని హెచ్చరించారు

Kishan Reddy: ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య

  • ప్రపంచ దేశాల ఎదుట పాకిస్థాన్‌ను దోషిగా నిలబెడతాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన

కవాడిగూడ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. పిరికిపంద చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ఠ అని ఆయన పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌లో పాకిస్థాన్‌ విషం చిమ్ముతోందని మండిపడ్డారు. భారత్‌ను దెబ్బతీయాలని చూస్తే.. పాక్‌ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ బుధవారం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన వారికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టికల్‌ 370ని తొలగించిన తర్వాత కశ్మీర్‌లో పర్యాటకుల సంఖ్య పెరిగి, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు.


ఇలాంటి తరుణంలో అమాయకులైన పర్యాటకులను హత్య చేసి మతం పేరుతో ప్రజలను విభజించేందుకు పాకిస్థాన్‌ కుట్ర చేసిందన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్‌ను దోషిగా నిలబెడతామని పేర్కొన్నారు. దేశంలో ఉన్న 140కోట్ల మంది ఏకమై.. ఉమ్మి వేస్తే.. పాకిస్తాన్‌ అందులో కొట్టుకుపోతుందన్నారు. ఎంపీలు లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరపడం.. హేయమని అన్నారు. భారత పౌరుల రక్తాన్ని కళ్ల చూసిన వారి అంతమే మన కర్తవ్యమని ప్రతిన బూనుదామన్నారు. ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Updated Date - Apr 24 , 2025 | 05:48 AM