G. Kishan Reddy: సౌదీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఘనస్వాగతం
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:17 AM
ఖనిజ భవిష్యత్తుపై సౌదీ అరేబియాలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి తెలుగు ప్రవాసీలు ఘనంగా స్వాగతం పలికారు.

తెలుగు ప్రవాసీలతో సరదాగా గడిపిన కేంద్రమంత్రి
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): ఖనిజ భవిష్యత్తుపై సౌదీ అరేబియాలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి తెలుగు ప్రవాసీలు ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం రియాధ్‌లో ప్రవాసీలు ఏర్పా టు చేసిన స్వాగత కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కీలక అరబ్బు దేశమైన సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వచ్చిన భారతీయులు ప్రత్యేకంగా తెలుగు ప్రవాసీలు వాణిజ్య, పరిశ్రమ రంగాల్లోనూ ఎదుగుతుండటం సంతోషకరమని అన్నారు. కుటుంబ సమేతంగా ఢిల్లీలోని తన ఇంట్లో జరిగిన సంక్రాంతి సంబురాలకు భారత ప్రధాని మోదీ, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయెల్ వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా వారు తనతో మాట్లాడుతూ.. భారత్-సౌదీ సంబంధాల పటిష్ఠతలో తన సౌదీ పర్యటన ఎంతో కీలకమని చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. దీంతో తాను పండుగ మధ్యలోనే సౌదీకి వచ్చినట్లు చెప్పారు. సౌదీలోని ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘం సాటా సెంట్రల్‌తో పాటు.. తెలుగు కళాక్షేత్రం, తాసా, హైదరాబాద్ నగరానికి చెందిన ఇతర ప్రవాసీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 20 నిమిషాల పాటు కిషన్ రెడ్డి ప్రసంగించి వెళ్లిపోతారని నిర్వాహకులు ప్రకటించినా.. తెలుగు వారి ఆప్యాయతతో రెండు గంటల పాటు ఆయన అందరితో కలిసి గడిపారు. ప్రప్రథమంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక కేంద్ర మంత్రి సౌదీకి వచ్చి ఆత్మీయంగా గడపడం ఆనందం కలిగించిందని అనేక మంది తెలుగు ప్రవాసీలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఆమె కేంద్ర మంత్రి కూతురా?
సౌదీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక యువతి కొందరు తెలుగు ప్రవాసీ మహిళలతో కలిసి కూర్చొంది. అందరితో ఆప్యాయంగా మాట్లాడుతున్న ఆమె.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూతురు వైష్ణవి అని తెలిసి ప్రవాసీలు ఆశ్చర్యపోయారు. సాదాసీదాగా అందరితో కలుపుగోలుగా మాట్లాడిన వైష్ణవి తీరును అందరూ మెచ్చుకోవడం కనిపించింది.