Kishan Reddy: పాకిస్థాన్ అంటే ఉగ్రవాద ఫ్యాక్టరీ
ABN , Publish Date - May 17 , 2025 | 04:10 AM
పాకిస్థాన్ అంటే ఉగ్రవాదాన్ని తయారుచేసే ఫ్యాక్టరీగా ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి చెప్పారు.

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులకు గుణపాఠం
నేడు హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ‘తిరంగా యాత్ర’
తాత్కాలికంగానే ఆపరేషన్ సిందూర్ నిలిపివేత
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్ అంటే ఉగ్రవాదాన్ని తయారుచేసే ఫ్యాక్టరీగా ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి చెప్పారు. ‘ఉగ్రవాదంపై గట్టి చర్యలు తీసుకుంటాం. మానవత్వానికి హాని చేసే వారిని వదిలి పెట్టం. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదానికి భారత్ సైన్యం గుణపాఠం చెప్పింది’ అని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ తాత్కాలికంగా మాత్రమే నిలిపేశామని, పూర్తిగా నిలువరించలేదని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత 15 రోజుల్లో ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకున్నదని చెప్పారు. కాందహార్ విమాన హైజాకింగ్, పుల్వా మా ఉగ్రదాడి కీలక సూత్రధారులైన ఉగ్రవాదులు యూసఫ్ రవూఫ్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ తదితరులందరినీ భారత సైన్యం మట్టుబెట్టిందని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్‌లో సైనికుల ధైర్యాన్ని అభినందించేందుకు శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద జరిగే ‘తిరంగా యాత్ర’లో ప్రజలు, విద్యార్థులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలుపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రాజకీయాలకతీతంగా ప్రముఖులందరినీ ఆహ్వానించామని చెప్పారు. గతంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కోసం ఎదురు చూసిన నేపథ్యం నుంచి భారత సైన్యానికి రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలు, బ్రహ్మోస్ క్షిపణులను మోదీ సర్కారు సమకూర్చిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రాఫెల్ యుద్ధ విమానాలు, ఎస్-400 కిపణుల కొనుగోలు చేసినప్పుడు.. అందుకు వ్యతిరేకంగా కొన్ని పార్టీల నేతలు ఆరోపణలు చేశారని, కానీ, వాటి విలువ, ప్రాధాన్యత, ఫలితాలేమిటో మొత్తం ప్రపంచం చూసిందని పేర్కొన్నారు. రక్షణ రంగ పరిశోధనలకు అవసరమైన వసతుల కల్పన, అంతరిక్ష రంగ పరిశోధన అభివృద్ధికి కృషి చేస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. దేశీయంగా తయారయ్యే రక్షణ రంగ సామాగ్రి 35 శాతానికి చేరుకోగా, అందులో ప్రైవేటు రంగ భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు.