Khammam: ప్రేమోన్మాదం
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:33 AM
ఖమ్మంలో ఓ యువకుడు ప్రేమోన్మాదంతో రెచ్చిపోయాడు. తనని ప్రేమించని యువతిపై యాసిడ్‌తో దాడి చేసి రాక్షసత్వం ప్రదర్శించాడు.
ఖమ్మంలో యువతిపై యాసిడ్ దాడి
తనని ప్రేమించడం లేదని ఓ యువకుడి ఘాతుకం
భోగి రోజున ఘటన
ఆలస్యంగా బయటకు, నిందితుడి అరెస్టు
ఖమ్మం క్రైం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ఖమ్మంలో ఓ యువకుడు ప్రేమోన్మాదంతో రెచ్చిపోయాడు. తనని ప్రేమించని యువతిపై యాసిడ్‌తో దాడి చేసి రాక్షసత్వం ప్రదర్శించాడు. సదరు యువతి భోగి పండగ రోజున తన ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఈ దాడి జరగ్గా.. విషయం ఆలస్యంగా పోలీసుల దృష్టికి వచ్చింది. ఖమ్మం త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం ప్రకాశ్‌నగర్ ప్రాంతానికి చెందిన పేరబోయిన గణేశ్ స్థానికంగా మండపం డెకరేషన్ పనులకు వెళుతుంటాడు. ఖమ్మంకే చెందిన ఓ నర్సింగ్ విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. తన వెంట పడవద్దని ఆ యువతి పలుమార్లు హెచ్చరించినా గణేశ్ పట్టించుకోలేదు. గణేశ్ వేధింపులు ఎక్కువ అవ్వడంతో బాధిత యువతి... ఓ పాఠశాలలో ఆయాగా పని చేసే తన తల్లి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. భర్తను కోల్పోయి కుమార్తె, కుమారుడిని పెంచుతున్న ఆమె.. తన కుమార్తె జోలికి రావద్దని గణేశ్‌ను కొద్దిరోజుల క్రితమే మందలించింది.
ఈక్రమంలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న రాత్రి బాధిత యువతి తమ ఇంటి ముందు ముగ్గువేస్తుండగా గణేశ్ అక్కడికి వచ్చాడు. తనని ప్రేమించడం లేదనే కోపంతో ఆపై యాసిడ్ చల్లి పరారయ్యాడు. యువతి చెయ్యి, పొట్ట మీద యాసిడ్ పడి గాయాలవ్వగా కుటుంబసభ్యులు, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. యువతి ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే, కుటుంబ పరువు పోతుందని, గణేశ్ మరేదైనా హాని తలపెడతాడనే భయంతో బాధితురాలు, ఆమె తల్లి దాడి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురాలేదు. కానీ, స్థానికుల ద్వారా ఆ నోట ఈ నోట పాకిన విషయం సోషల్ మీడియా ద్వారా పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో విచారణ జరిపిన పోలీసులు బాధిత యువతి తల్లి నుంచి మంగళవారం రాత్రి ఫిర్యాదు తీసుకుని గణేశ్‌ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్
Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’