Share News

Phone Tapping Case: 5న సిట్‌ ముందుకు వస్తా

ABN , Publish Date - Jun 02 , 2025 | 04:53 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌(ఓఎస్డీ) ప్రభాకర్‌రావు ఇన్నాళ్లు అమెరికాలో ఉండగా..

Phone Tapping Case: 5న సిట్‌ ముందుకు వస్తా

  • లేఖ రాసిన ప్రభాకర్‌రావు!.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

  • ప్రభాకర్‌రావు వాంగ్మూలమే కీలకం.. ఆయన కనుసన్నల్లోనే ట్యాపింగ్‌!

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌(ఓఎస్డీ) ప్రభాకర్‌రావు ఇన్నాళ్లు అమెరికాలో ఉండగా.. తాను సిట్‌ ముందుకు వస్తానని, విచారణకు సహకరిస్తానని పేర్కొంటూ లేఖ రాసినట్లు తెలిసింది. ఈ నెల 5న సిట్‌ను కలుస్తానని ఆ లేఖలో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా ముందు భారత్‌కు రావాలని, విచారణకు సహకరించాలని సూచించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు ఇప్పటికే ఈ మేరకు అండర్‌టేకింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే..! ప్రభాకర్‌రావు విచారణకు సహకరిస్తారని వారు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇక పాస్‌పోర్టును పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ అధికారులతో న్యాయవాదులు సంప్రదింపులు జరుపుతున్నారు. ‘వన్‌టైం ఎంట్రీ’ పాస్‌పోర్టుకు లైన్‌ క్లియర్‌ అయ్యే అవకాశాలున్నాయి. పాస్‌పోర్టు జారీ అయిన మూడ్రోజుల్లో ప్రభాకర్‌రావు విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు తన మధ్యంతర ఆదేశాల్లో పేర్కొంది. ఆ మేరకు ప్రభాకర్‌రావుపై బలవంతపు చర్యలొద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.


కీలక మలుపునకు చాన్స్‌

ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు తమ వాంగ్మూలాల్లో ప్రభాకర్‌రావు చెప్పినట్లు చేశామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభాకర్‌రావు విచారణ కీలకంగా మారనుంది. ఆయన వాంగ్ములంతో కేసు కీలక మలుపులు తిరిగే అవకాశాలున్నాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ కోణం పెద్దగా బహిర్గతం కాకున్నా.. పలువురు బీఆర్‌ఎస్‌ నేతల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇప్పుడు ప్రభాకర్‌రావు వాంగ్మూలమిస్తే.. ఎవరి ఆదేశాలతో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది? హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకున్నారా? ఒకవేళ అత్యవసరంగా ఫోన్లను ట్యాప్‌ చేస్తే.. ఆ తర్వాత ఏడు రోజుల్లో లిఖితపూర్వకంగా హోంశాఖ కార్యదర్శికి చెప్పారా? అనే కోణాల్లో ప్రభాకర్‌రావును విచారించే అవకాశాలున్నాయి. సిట్‌ దర్యాప్తులో దాదాపు 1,200 నంబర్లను ప్రణీత్‌రావు అండ్‌ కో ట్యాపింగ్‌ చేసినట్లు తేలగా.. హోంశాఖకు మాత్రం పదుల సంఖ్యలోనే ఫోన్‌ నంబర్లపై అభ్యర్థనలు వచ్చినట్లు సమాచారం. అయితే.. ప్రభాకర్‌రావు విచారణకు సహకరిస్తారా? అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానమిస్తారా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.


ఇవి కూడా చదవండి

తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..

మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Updated Date - Jun 02 , 2025 | 04:53 AM