CM Revanth Reddy: 42శాతానికి కేసీఆర్ చట్టమే శాపం
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:29 AM
తమ ప్రభుత్వం బీసీలకు కల్పించాలనుకుంటున్న 42 శాతం రిజర్వేషన్లకు గతంలో కేసీఆర్ చేసిన చట్టమే శాపంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..
మొత్తం 50% మించకుండా చట్టంతో బిగించారు
మతం ముసుగులో రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డు
‘ఓట్ల చోరీ’పై యుద్ధానికి బీసీల మద్దతు కావాలి: సీఎం
సర్వాయి పాపన్న విగ్రహానికి రేవంత్ శంకుస్థాపన
టీ-ఫైబర్‌పై సమగ్ర నివేదిక ఇవ్వండి: ముఖ్యమంత్రి
హైదరాబాద్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వం బీసీలకు కల్పించాలనుకుంటున్న 42 శాతం రిజర్వేషన్లకు గతంలో కేసీఆర్ చేసిన చట్టమే శాపంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా పకడ్బందీగా చట్టం చేశారని మండి పడ్డారు. మరోపక్క మతం ముసుగులో బీజేపీ నేతలు, బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చట్టంలోనే లేవని, ఎందుకు అబద్దాలతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ప్రశ్నించారు. దూదేకుల, నూర్ బాషా, బార్బర్, దోబీ వృత్తి చేసే ముస్లింలకు 56 ఏళ్లుగా బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తు చేశారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో బీసీలలో ఉన్న ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించగలరా? అని నిలదీశారు. సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 375వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. టాంక్‌బండ్ సమీపంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసి, రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ‘‘గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనమే. గతంలో తెలంగాణ ఇస్తామని చెప్పారు మాట నిలబెట్టుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్‌గాంధీ మాట ఇచ్చారు. ఆయన సూచనల మేరకే కులగణన సర్వే చే శాం. అందులో తప్పులుంటే చూపాలని సవాల్ విసిరాం. తప్పులు చూపితే క్షమాపణ చెబుతామన్నాం.

రాజకీయ ప్రయోజనాల కోసం కులగణను తప్పు పట్టవద్దు. దీన్ని తప్పుపడితే మరో వందేళ్ల వరకు బీసీలకు న్యాయం జరగదు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లులు రూపొందించి ఆమోదం కోసం గవర్నర్‌కు పంపి నెలలు గడుస్తున్నా వాటిని ఆమోదించలేదు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో కేసీఆర్ చేసిన చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్‌ను రూపొందించి, గవర్నర్ ఆమోదం కోసం పంపగా, అది కూడా రాష్ట్రపతి వద్దే పెండింగ్‌లో ఉంది’’ అని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లులను ఆమోదించాలని ఢిల్లీలో ధర్నా చేశామని, 100 మందికి పైగా ఎంపీలు వచ్చి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఈ ధర్నాకు బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది కిషన్‌రెడ్డి, మోదీ కాదా? అని నిలదీశారు.

దొంగ ఓట్లతోనే మహారాష్ట్రలో అధికారం
దొంగ ఓట్లతో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు పూర్తి మెజారిటీలభించగా, తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు అంత తేడా వచ్చింది? నాలుగు నెలల్లోనే ఎన్నికల కమిషన్ కోటి ఓట్లు ఎలా నమోదు చేసింది? అంబేద్కర్ పుట్టిన గడ్డ మీదనే రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. దొంగ ఓట్లతోనే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశం న లుమూలలా ఓట్ల చోరీ జరుగుతోంది. బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపి, బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారు. ఈ కుట్రను రాహుల్ గాంధీ బయటపెట్టారు. తప్పు చేసిన వారిని వదిలేసి తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడుగుతోంది. ఇది ఎంతవరకు న్యాయం? ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్‌గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో నేను, భట్టి ఆ పాదయాత్రలో పాల్గొంటాం. అందరం కలిసి ఓట్ల చోరీకి పాల్పడే వారి భరతం పడదాం. సమస్య వచ్చినపుడు పోరాడేందుకు మీ నైతిక మద్దతు ఉండాలి’’ అని కోరారు. విగ్రహాల ఏర్పాటు వర్థంతులు, జయంతుల కోసమే కాదు, యువతలో స్ఫూర్తిని రగిలించేందుకని ముఖ్యమంత్రి చెప్పారు. మొగలుల పాలన కాలంలోనే బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. అందుకే సచివాలయం సమీపంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఖిలా షాపూర్ కోటను మైనింగ్ పేరుతో కాలగర్భంలో కలిపే కుట్ర చేసిందని ఆరోపించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.