Share News

KCR: అసెంబ్లీకి ఈసారీ.. కేసీఆర్‌ డుమ్మా!

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:29 AM

ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్‌ నివేదిక ప్రకారం..

KCR: అసెంబ్లీకి ఈసారీ.. కేసీఆర్‌ డుమ్మా!

  • మరోసారి గైర్హాజరు కానున్న ప్రతిపక్ష నేత

  • బీఆర్‌ఎస్‌ అనుసరించాల్సిన వ్యూహంపై.. కేటీఆర్‌, హరీశ్‌లకు అధినేత దిశానిర్దేశం

  • కాళేశ్వరంపై ఆరోపణలను తిప్పికొట్టండి

  • వరదలు, యూరియాపై ప్రశ్నించండి

  • ప్రజా సమస్యలపై నిలదీయండి: కేసీఆర్‌

హైదరాబాద్‌/గజ్వేల్‌/మర్కుక్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్‌ నివేదిక ప్రకారం.. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ అధికార కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. అసెంబ్లీలో ఈ అంశంపై జరిగే చర్చకు హాజరు కాకూడదని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆయన శాసనసభకు హాజరైతే.. కాళేశ్వరం నివేదికలోని అంశాల ఆధారంగా ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెబుతారు? సభలో ఏం మాట్లాడతారన్న దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ ముఖ్యనేతలు శుక్రవారం ఎర్రవల్లిలోని ఫాంహౌ్‌సకు వెళ్లి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై వారికి కేసీఆర్‌ సూచనలు చేశారు. కాళేశ్వరం కమిషన్‌ నివేదికలోని ఏయే అంశాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్చకు పెడుతుంది, వాటికి సభలో ఏం సమాధానం చెప్పాలి, ప్రజలకు ఎలా వివరించాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు.


కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై చర్చ ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కాళేశ్వరం విషయంలో నిజానిజాలను అసెంబ్లీ వేదికగా బహిర్గతం చేద్దామని కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వం చేస్తున్న అసత్యాలను ప్రజలకు తెలియబరచాలని, వాస్తవాలను వివరించాలని సూచించినట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కాళేశ్వరంపైౖ ప్రజలకు వాస్తవాలు చెప్పారని, అదే రీతిలో అసెంబ్లీలోనూ కాళేశ్వరం ద్వారా ప్రజలకు జరిగే లబ్ధి తెలిసేలా చూడాలని అన్నట్లు తెలిసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సభలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు. అయితే ఇందుకు స్పీకర్‌ అనుమతిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ఇక అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, రాష్ట్రంలో యూరియా కొరత, వరదల అంశం, సీజనల్‌ వ్యాధులు, పారిశుధ్యం అంశంపై ప్రశ్నించాలని పార్టీ నేతలకు కేసీఆర్‌ సూచించినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 08:51 AM